ఎడారిలో జలకళ
కొలిలా జోగా(రాజస్తాన్): రెండేళ్ల క్రితం వరకు రాజస్తాన్ ఎడారిలోని ఆ గ్రామంలో ఎక్కడా నీటి చుక్క జాడలేదు. 1,500 కుటుంబాలకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరానే దిక్కు. ఇప్పుడు రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా కొలిలా జోగా గ్రామం తాగు, సాగునీటితో కళకళ లాడుతోంది. ఈ వేసవిలో పంటల్ని సాగుచేయడమే కాకుండా అధిక దిగుబడి వస్తుందని ఆనందపడుతున్నారు. ఇదంతా జరగడానికి కేవలం గ్రామం లోని యువకులు, పెద్దలు తీసుకున్న ఓ చిన్న నిర్ణయమే కారణం. 2016లో ఆ గ్రామంలోని యువకులు, పెద్దలు ప్రతీరోజు మూడు షిఫ్ట్‌లు గా ఏర్పడి పలుగు, పారలు తీసుకుని గ్రామంలోని కుంటలను తవ్వే కార్య క్రమాన్ని ప్రారంభించారు.
ఇలా గ్రామంలో కనిపించిన ప్రతీ కుంటను చిన్న సైజు చెరు వుగా మార్చాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జల్ స్వావ లంబన్ అభియాన్(ఎమ్‌జేఎస్‌ఏ) కార్యక్రమం పేరిట వీరి ప్రయత్నాలకు జిల్లా అధికార విభాగం సాయం అందించింది. ఎమ్‌జేఎస్‌ఏలో పెద్ద యంత్రాలతో కుంటలను చెరువులుగా మార్చే బృహత్తర కార్యక్ర మాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఉన్న చిన్న కుంటను 26 హెక్టార్లలో 7,630 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల చెరువుగా మార్చారు. ఈ గ్రామ ప్రయత్నాన్ని ఇతర గ్రామాలు కూడా అవలంభిస్తున్నాయి. ఎమ్‌జేఎస్‌ఏ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని 7,740 గ్రామాలు చేరాయి.