జీతాలు పెంచుతాం
కాంట్రాక్టు డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు కడియం హామీ
- నగరంలో ఖాళీ కుండల ప్రదర్శన తగ్గింది: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు త్వరలో పెంచుతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం శాసనసభలో సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, సండ్ర వెంకటవీరయ్య తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం 19 ఫిబ్రవరి 2016న కాంట్రాక్టు, ఇతర సర్వీసుల రెమ్యునరేషన్ ఏ విధంగా పెంచాలో తెలు పుతూ జీవో 14 విడుదల చేసింది. ప్రస్తుతం ఇస్తున్న దానికి 50 శాతం పెంచి ఇవ్వాలని పేర్కొంది. జీవో 409 ద్వారా కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు రూ.18 వేల నుంచి రూ.27 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చాం. త్వరలోనే డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు పెంచుతాం ’ అని కడియం పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియపై కొంతమంది ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడం, ఈ కేసులో తీర్పు ఇచ్చేవరకు రెగ్యులరైజేషన్ చేయొద్దని కోర్టు చెప్పడంతో అది నిలిచిపోయిందని వివరించారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
రోజూ నీటి సరఫరాకు ప్రణాళిక: కేటీఆర్
రాష్ట్రంలో తాగునీటి సరఫరా గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగైందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఖాళీ కుండల ప్రదర్శనలు జరిగేవని, ప్రస్తుతం అవి తగ్గాయని అన్నారు. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల మున్సిపాల్టీల సర్కిళ్ల కోసం రూ.1900 కోట్ల వ్యయంతో నీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. హడ్కో నుంచి రూ.1700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు సమకూర్చు కొని పనులు చేపట్టామని, 2018 ఫిబ్రవరి నాటికి అవి పూర్తవుతాయని పేర్కొన్నారు. ఎం ఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాల, బీజేపీ సభ్యులు లక్ష్మణ్, చింతల రాంచం ద్రారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. మరింత నీటి సరఫరా కోసం శామీర్‌పేట, రాచకొండలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని, మొదటగా శామీర్‌పేట రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నగరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న 19 చోట్లకు తరలిస్తామని వెల్లడించారు.
చిన్న పరిశ్రమలకు చేయూత
ఇక చిన్న, మధ్యతరహా పరిశ్రామలపై అడిగిన మరో ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధాన మిస్తూ, చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉద్యోగాలు చిన్నతరహా పరిశ్రమల నుంచి వస్తున్నందున వాటికి ఆర్థిక చేయూత ఇవ్వాలని ఆర్‌బీఐని కోరామని, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు పారిశ్రామిక ఆరోగ్య క్లినిక్‌ల విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. దీనికి ఒక సీఈవోను నియమించడంతోపాటు రూ.100 కోట్ల మూలనిధిని ప్రభుత్వం సమకూర్చనుందని చెప్పారు. ఇక పరిశ్రమల స్థాపనకు భూములు తీసుకొని, వాటిని ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని, ఇప్పటికే పలు సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకున్నామని తెలిపారు.
వ్యవసాయ శాఖలో 1,311 పోస్టుల భర్తీ: పోచారం
వ్యవసాయ శాఖలో 1,311 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీటి తోపాటే ఉద్యానవన విభాగంలో 70 పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే నాలుగు వ్యవసాయ పాలి టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు, ప్రతి కళాశాలలో 30 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించి నట్లు మంత్రి పోచారం తెలిపారు.