నల్లా సరే..నీళ్లేవి?
రూ.1కే నల్లా కనెక్షన్ ఇచ్చినా...
డిమాండ్‌కు సరిపడా నీటి సరఫరాపై అనుమానాలు!
సిటీబ్యూరో: రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గత నెలలో జారీచేసినఉత్తర్వులకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నల్లా కనెక్షన్లు మంజూరు చేసేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా....అసలు నల్లా కనెక్షన్లు తీసుకున్న ఇళ్లకు నీళ్లు ఎలా సరఫరా చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. గ్రేటర్ జనాభాకు అనుగుణమైన నీటి సరఫరా వ్యవస్థ ప్రస్తుతం లేదు. దీంతో అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా కష్టమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ సుమారు వెయ్యి కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన పైపులైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేవు. హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్లతో ఇటీవల చేపట్టిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులను ఏడాదిలో యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే నిరుపేదల దాహార్తి తీరనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మార్గదర్శకాల తయారీలో నిమగ్నం..
పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షల లోపుగా ఉన్నవారిని బీపీఎల్ కుటుంబాలుగా పరిగణిస్తారు. కనెక్షన్ పొందాలనుకునేవారు విధిగా ఆదాయ సర్టిఫికెట్ ను దరఖాస్తు ఫారంతోపాటు జత చేయాల్సి ఉంటుందని, ఇతరత్రా నిబంధనలను సైతం మార్గదర్శకాల్లో పొందుపరచి క్షేత్రస్థాయిలోని జనరల్ మేనేజర్ కార్యాలయాలకు త్వరలో పంపి్తున్నట్లు వాటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా మహానగరం పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లా కనెక్షన్లుండగా..సుమారు 13 లక్షల నిరుపేద కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. కానీ నగరంలో జలమండలి మంచినీటిని సరఫరా వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దశలవారీగా రూ.1కే నల్లా కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నాయి.
డిమాండ్..సరఫరా మధ్య అంతరం తీరేదెలా?
మహానగరం జనాభా కోటికి చేరువైంది. కానీ మొన్నటివరకు రాజధాని దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా(మెదక్), హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ప్రస్తుతం కృష్ణా మూడు దశల ద్వారా 270, గోదావరి మొదటిదశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని నగరానికి అత్యవసర పంపింగ్ ద్వారా తరలించి 8.75 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. కానీ నీటి డిమాండ్ 542 మిలియన్ గ్యాలన్లుగా ఉండడం గమనార్హం. అంటే ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటికి..డిమాండ్ మధ్య అంతరం 186 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. ఇక భవిష్యత్‌లో నల్లా కనెక్షన్ల సంఖ్య మరో 13 లక్షలు పెరిగితే నీటి డిమాండ్ వెయ్యి మిలియన్ గ్యాలన్లకు చేరుకోవడం తథ్యం. ఈనేపథ్యంలో ఈ స్థాయిలో నీటిని ఎక్కడినుంచి తరలిస్తారన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ శివార్లలో శామీర్‌పేట్(గోదావరి జలాలు), మల్కాపూర్(కృష్ణా జలాలు)లలో యుద్ధ ప్రాతిపదికన రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించి 40 టీఎంసీల నీటిని సీజన్‌లో నిల్వచేస్తేనే గ్రేటర్ దాహార్తి సమూలంగా తీరుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
గతంలో రూ.200.. నేడు రూ.1
గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రూ.200కే కనెక్షన్ మంజూరు చేసేవారు. సర్కారు తాజా ఉత్తర్వులతో ఒక్కో కుటుంబానికి రూ.199 ఆదా కానుంది. కాగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీల్లో మంచినీటిసరఫరా వ్యవస్థ, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం హడ్కో సంస్థ జారీచేసిన రూ.1900 కోట్ల నిధులతో ఆయా ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను విస్తరిస్తున్నారు. ఈనేపథ్యంలో మరో ఏడాదిలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పదిలక్షల పేద కుటుంబాలకు రూ.1 కే నల్లా కనెక్షన్లు ఏర్పాటు కానున్నాయని జలమండలి వర్గాలు తెలిపాయి.అయితే రూ.1కే కనెక్షన్ ఇచ్చినా..నెలకు ఒక్కో కుటుంబానికి సరఫరా చేయనున్న 15 వేల లీటర్ల నీటికి రూ.150 నీటిబిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశాయి. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాలకు తక్షణం కనెక్షన్ ఇస్తామని తెలిపాయి.