‘భగీరథ’ పనులు సకాలంలో పూర్తి చేయాలి
ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నల్లా ద్వారా ఇంటింటికీ తాగు నీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. భగీరథ పనులపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో శనివారం గ్రామీణ నీటి సరఫరా ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. భగీరథ ద్వారా మంచినీటి సరఫరాను ఆయా గ్రామాల్లోని షెడ్యూల్ కులాలు, తెగల ప్రజలు ఉండే కాలనీల నుంచే ప్రారంభించాలని సూచించారు. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలను సమన్వయ పరిచాకే ఆయా గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ పనులను ప్రారంభించాలన్నారు.
వేగంగా భగీరథ పనులు: ప్రశాంత్‌రెడ్డి
మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్నంత వేగంగా దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదని తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేంద్రం కూడా భగీరథ పనుల వేగం, నాణ్యతను వివిధ వేదికలపై ప్రశంసిస్తోందని తెలిపారు. ఇంటేక్‌వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్లు, ఇంట్రా విలేజ్ పైప్ లైన్ పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.1,816 కోట్ల రుణం మంజూరు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. శ్రీశైలం– వికారాబాద్– చేవేళ్ల– తాండూరు–పరిగి, శ్రీశైలం–గుడిపల్లి సెగ్మెంట్ పనులకు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఎంవోయూ పత్రాలపై సీఎస్ ఎస్పీ సింగ్, బ్యాంక్ ప్రతినిధులు సంతకాలు చేశారు.