‘మిడ్‌ మానేరు’కు ఎల్లంపల్లి నీళ్లు | Yellampalli project water to the Mid Manair Dam | Sakshi

‘మిడ్‌ మానేరు’కు ఎల్లంపల్లి నీళ్లు

Jul 22 2018 2:15 AM | Updated on Oct 30 2018 7:50 PM

Yellampalli project water to the Mid Manair Dam - Sakshi

మోటారు పంపు డ్రైరన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో పద్మా దేవేందర్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అక్టోబర్‌ నాటికి 6,7,8 ప్యాకేజీలు అందుబాటులోకి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీటి సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గ్రామ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ, ప్యాకేజీ అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌లో మొదటి విద్యుత్‌ మోటారును డ్రైరన్‌ చేసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడో ప్యాకేజీకి సంబంధించి 50 కిలోమీటర్ల ట్విన్‌ టన్నెల్‌ డ్రిల్లింగ్‌ పనుల్లో 49.988 కి.మీ. పని పూర్తయిందని, 12 మీటర్ల టన్నెల్‌ డ్రిల్లింగ్‌ మాత్రమే ఉన్నప్పటికీ లూజ్‌సాయిల్‌ వల్ల జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోందన్నారు. మరో 10 రోజుల్లో మిగిలిన 12 మీటర్ల టన్నెల్‌ డ్రిల్లింగ్‌ పూర్తి చేసి.. ఆ తర్వాత లైనింగ్‌ పనులు చేపడుతామని చెప్పారు. 

మొదటి పంపు డ్రైరన్‌ విజయవంతం 
‘కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంపుమోటార్‌ను విజయవంతంగా డ్రైరన్‌ నిర్వహించామని మంత్రి తెలిపారు. 139 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మోటారు ప్రపంచ సాగునీటి రంగంలోనే అతి పెద్దదన్నారు. స్వదేశీ టెక్నాలజీతో బీహెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో ఈ పంపు మోటారు తయారైందని, మోటారు గరిష్టంగా 214 ఆర్‌పీఎం స్పీడ్‌తో నడుస్తుందన్నారు. ఇవాల్టి డ్రైరన్‌లో పూర్తి సామర్థ్యంతో పని చేసిందన్నారు. 

13 పంపుహౌస్‌ల్లో 86 మోటార్లు 
కాళేశ్వరం ప్రాజెక్టులో 13 పంపు హౌస్‌ల్లో మొత్తం 86 మోటార్లు పెడుతున్నామని, వాటిలో మొదటి మోటార్‌ శనివారం విజయవంతం అయిందని హరీశ్‌రావు అన్నారు. నీటిని లిఫ్ట్‌ చేయడానికి అవసరమైన కరెంట్‌ కోసం 18 సబ్‌స్టేషన్ల నిర్మాణం జరగుతోందని చెప్పారు. లక్ష్మిపూర్‌లో 400 కేవీ సబ్‌స్టేషన్‌ పూర్తి కావడంతో అదే కరెంట్‌తో ఇవాల్టి మోటార్‌ డ్రై రన్‌ చేశామని, 8వ ప్యాకేజీలోని మిగతా మోటార్లన్నీ సెప్టెంబర్‌ నాటికి పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు. మేడారం దగ్గర 6వ ప్యాకేజీ కి సంబంధించి గ్యాస్‌ బేస్డ్‌ 400 కేవీ పవర్‌ సబ్‌స్టేషన్‌ ఈనెల 25లోగా పూర్తవుతుందని చెప్పారు.

ఇది కూడా ప్రపంచంలో గ్యాస్‌ ఆధారిత అది పెద్ద సబ్‌స్టేషన్‌ అని పేర్కొన్నారు. 6వ ప్యాకేజీ సబ్‌ స్టేషన్‌ పూర్తయితే ఆగస్టు 2వ వారంలో ఇక్కడి మోటార్ల డ్రై రన్‌ కూడా చేస్తామన్నారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement