మిషన్ భగీరథకు నీళ్లు కష్టమే!
► సాగర్‌లోకి నీరు రాకుంటే జనవరి నుంచి నీటి సరఫరాకు తంటాలు
► భగీరథ, ఇతర తాగునీటి అవసరాలకు 59 టీఎంసీలు అవసరం
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర కానుకగా వచ్చే జనవరి 1న రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకూ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు ల్లో నీటి కొరత పెద్ద అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కోటి మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చే నాగార్జున సాగర్‌లో నీటి మట్టాలు పడిపోవ డం, ఎగువ నుంచి దిగువకు నీటి విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధత రాష్ట్రాన్ని కలవరపె డుతోంది. శ్రీశైలానికి వచ్చిన నీటిని వచ్చినట్లు గా వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రూపొందిస్తుండటం, రాష్ట్ర తాగునీటి అవసరాలను సమస్యల్లోకి నెడుతోంది.
భగీరథకు ఏటా 16 టీఎంసీ..
నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి పది శాతం నీటిని రిజర్వాయర్ల నుంచి తీసుకోవాలని ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగానూ కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి వచ్చే జనవరికే 59.17 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు.
ఇందులో ఒక్క సాగర్ పరిధిలోని అక్కంపల్లి, ఉదయ సము ద్రం, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారానే సుమారు 16 టీఎంసీలు తీసుకుని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీటి కొరత దృష్ట్యా ఈ నీటిని సరఫరా చేయడం గగనంగా మారిపోయింది. సాగర్ వాస్తవ నీటిమట్టం 590 అడుగులు కాగా.. కనీస నీటిమట్టం 510 అడుగులు. ఎనిమిది నెలలుగా కనీస నీటి మట్టానికి దిగువకు వెళ్లి నీటిని తోడేస్తుండ టంతో ప్రస్తుతం సాగర్‌లో 500.90 అడుగుల మట్టానికి నిల్వలు పడిపోయాయి.
ఎగువ నుంచి రావడం కష్టమే..
సాగర్ ఆశలన్నీ ఎగువ శ్రీశైలం పైనే ఉన్నా యి. ప్రస్తుతం శ్రీశైలానికి భారీ ప్రవాహాలు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు 215 టీఎంసీలకుగానూ 90 టీఎంసీలకు చేరాయి. మరో 125 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులకుగానూ 854 అడుగులకు చేరడం తో ఏపీ తన అవసరాలకు నీటి విడుదలపై దృష్టి పెట్దింది. ఇప్పటికే ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకుంటున్న ఏపీ.. అదనంగా హం ద్రీనీవా, పోతిరెడ్డిపాడులకు చెరో 5 టీఎంసీ చొప్పున 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద మరో 7 టీఎంసీలు కావాలని బోర్డుకు లేఖ రాసింది. ప్రస్తుతం శ్రీశైలంలోకి నీటి ప్రవాహం ఉన్న దృష్ట్యా బోర్డు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. శ్రీశైలానికి వచ్చి న నీటిని ఎగువే వాడేస్తుంటే దిగువ సాగర్‌కు నీరు రావడం సమస్యగా మారనుంది.
55 టీఎంసీలు అవసరమంటున్న రాష్ట్రం..
తెలంగాణ తాగునీటి అవసరాలు, సాగర్‌లో గతంలో కనీస నీటిమట్టానికి దిగువకు వెళ్లి చేసిన నీటి వినియోగాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలోని పవర్‌హౌస్ ద్వారా సాగర్ కు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాల ని తెలంగాణ కృష్ణా బోర్డుకు సోమవారం లేఖ రాసింది.
ప్రస్తుతం శ్రీశైలానికి ఎగువ జూరాల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొన సాగుతుండటం, ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులకు చేరినందున, సాగర్‌లో పూర్తిగా పడిపోయిన నిల్వలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పాటే జనవరి నుంచి ఉండే మిషన్ భగీరథ అవసరాలకు 16 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో 16, నల్ల గొండ, ఖమ్మం అవసరాలకు 4, కల్వకుర్తి కింది అవసరాలకు 4 టీఎంసీ కలిపి మొత్తం గా 55 టీఎంసీలు కావాలని బోర్డుకు లేఖ రాసింది. అయితే ఈ అవసరాలకు బోర్డు ఓకే చెబుతుందా? బోర్డు ఓకే అన్నా ఏపీ అభ్యంతరం పెట్టకుండా ఊరుకుంటుం దా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై చర్చించేందుకు త్వరలోనే బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది.