24 గంటలూ తాగునీరు
♦ వికారాబాద్‌లో మూడు నెలల్లో ప్రతి ఇంటికీ నీటి సరఫరా
♦ మీటర్లు బిగించే పనిలో మున్సిపల్ యంత్రాంగం
♦ ఒక్కో కుటుంబానికి 20 కిలోలీటర్ల నీరు
♦ నీటిని పొదుపు చేసే ఆలోచనలో అధికారులు
రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఆడపడుచులు బిందె పట్టుకుని బోర్ల వద్దకో.. చేతిపంపు వద్దకో వెళ్లనక్కర్లేదు. వికారాబాద్ పట్టణానికి మరో మూడు నెలల్లో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు తాగునీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. ఇప్పటికే ప్రతి ఇంటికీ మంజీరా పైపులైన్ ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ఇప్పటివరకు 10 వేల కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చిన మున్సిపల్ యంత్రాంగం.. ప్రస్తుతం ప్రతి నల్లాకు మీటర్లు బిగించే పనిలో నిమగ్నమైంది. - వికారాబాద్ రూరల్
వికారాబాద్ రూరల్ : అరవై వేల జనాభా ఉన్న వికారాబాద్ పట్టణవాసులకు మంజీరా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటి వరకు మున్సిపల్ యంత్రాంగం సుమారు పది వేల కనెక్షన్లకు ఇచ్చింది. ప్రస్తుతం సుమారు 1000 నల్లాలకు మీటర్లను బిగించింది. మరో 9 వేలకు పైగా మీటర్లు బిగించిన అనంతరం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా 24 గంటల పాటు నీటి ని సరఫరా చేయనున్నారు. మంజీరా, శివసాగర్ నీటిని పట్టణంలోని సంపులోకి తరలించి అక్కడ ఫిల్టర్ అనంతరం ఆ నీటిని ప్రతి ఇంటికీ నిరంతరం నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు 20 కేఎల్ (20 వేల కిలో లీటర్లు)పైగా నీటిని అందించనున్నట్లు వా రు పేర్కొంటున్నారు. తద్వారా కుటుంబానికి ఎంత అవసరమో అంతే నీటిని వినియోగదారులు వాడుకునే అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి నీటిని వృథా చేస్తే ఎక్కువ బిల్లు ఎక్కువ వస్తుంది.
నీటి వృథా చాలావరకు తగ్గుతుంది.
ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి వాటికి మీటర్లను బిగించడం వల్ల చాలావరకు నీటి వృథా తగ్గిపోతుందని అధికారులు తెలుపుతున్నారు. గతంలో కాలనీలు, ఇళ్ల వరకు ఉన్న నల్లాలకు ఎలాంటి మీటర్లు కాని లేక పోవడంతో గృహ వినియోగదారులు ఇష్టం వచ్చినట్లు నీటిని వృథా చేసేవారు. ప్రస్తుతం మీటర్లను బిగిస్తుండడంతో నీటి వృథాను చాలావరకు అరికట్టవచ్చు.
20 కేఎల్‌కు రూ. 200
ప్రతి కుటుంబానికి 20 కే ఎల్ నీటికి పైగా ఇవ్వాలని భావిస్తున్న అధికారులు.. ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆలోచన చేస్తున్నారు. 20 కేఎల్ నీటిని వాడుకున్న వారికి కనీసంగా 200 రూపాయల బిల్లు అయ్యే విధంగా చూస్తారు. ఆపై నీటిని వాడుకున్న వారికి అదనంగా చార్జ్ చేసే ఆలోచనలో మున్సిపల్ యంత్రాంగం ఉంది.
తీరనున్న తాగునీటి కష్టాలు
గతంలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోయేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బయటకు వెళ్లే బాధ తప్పిపోయింది.