మంచినీటి సరఫరా విషయంలో ఇద్దరు టీడీపీ కౌన్సిలర్ల మధ్య తలెత్తిన ఘర్షణలో 8 మంది గాయపడ్డారు.
గిద్దలూరు(ప్రకాశం): మంచినీటి సరఫరా విషయంలో ఇద్దరు టీడీపీకి కౌన్సిలర్ల మధ్య తలెత్తిన వివాదం.. కొట్టుకునేదాకా వెళ్లింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 17, 18వ వార్డు కౌన్సిలర్లుగా చింతలపూడి రామలక్ష్మి, సూరేపల్లి గురమ్మ ఉన్నారు. వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికైన చింతలపూడి రామలక్ష్మి ఇటీవలే టీడీపీలో చేరారు. నిత్యం సరఫరా చేసే ట్యాంకర్ నీటిని ముందుగా తన ఇంటికే సరఫరా చేయాలని 18 వ వార్డు కౌన్సిలర్ సూరేపల్లి గురమ్మ పట్టుబడుతోంది. అయితే, వాటర్‌మెన్ లక్ష్మీనారాయణ తన మాట వినటం లేదని ఆగ్రహంతో ఉన్న గురమ్మ కుటుంబీకులు ఇటీవల అతడిపై చేయిచేసుకున్నారు. గాయాలపాలైన అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి శుక్రవారం ఉదయం విధుల్లో చేరాడు.
నీటి సరఫరా సమయంలో అతడు తమ ఇంటి సమీపంలోకి రాగానే మరోసారి గురమ్మ కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. ఈ విషయాన్ని అతడు తన బంధువైన కౌన్సిలర్ రామలక్ష్మికి తెలిపాడు. దీంతో ఆమె తన వారిని తీసుకుని గురమ్మ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో రామలక్ష్మి, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ గురమ్మ కొడుకు వెంకట్రావుతోపాటు మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీహరి సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.