
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పల్లెల్లో నివసించే జనాభాకు వారి కనీస అవసరాలకు తగినంత నీరు సరఫరా కావడం లేదు. నీటి లభ్యత కూడా ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో, ఏయే గ్రామాలకు నీటి సరఫరా ఎంత పరిమాణంలో జరుగుతోందనే వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో రాష్ట్రంలో 24,783 పల్లెలకు వాటి కనీస అవసరాలకు సరిపడా నీటి సరఫరా, లభ్యత లేదని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు ఒక్కో వ్యక్తికి అన్ని అవసరాలకు కనీసం రోజుకు 70 లీటర్ల నీరు అవసరం.
ఆ మేరకైనా ప్రభుత్వాలు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 24,783 పల్లెల్లో నివసిస్తున్నవారిలో ఒక్కో వ్యక్తికి రోజుకు 55 ఎల్‌పీసీడీ (లీటర్ ఫర్ కేపిటా ఫర్ డే) నీటిని కూడా సరఫరా చేయడం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 4,999 పల్లెల్లో 55 ఎల్‌పీసీడీ నీటి సరఫరా కూడా లేదని స్పష్టమైంది. విశాఖ జిల్లాలో 3,489 పల్లెల్లో కూడా కనీసం 55 ఎల్‌పీసీడీ నీరు సరఫరా కావడం లేదని వెల్లడైంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత అన్ని గ్రామాలకు ఇంటింటికీ ట్యాప్ వాటర్ సరఫరా అంటూ వాటర్‌గ్రిడ్ పేరుతో హడావిడి చేశారు. అధికారులు కూడా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూపొందించారు. కానీ ఎందుకో స్వయంగా సీఎం చంద్రబాబే ఆ గ్రిడ్‌ను పక్కన పెట్టమని చెప్పడంతో అధికారులు అటకెక్కించారు.