తాగు నీరు బంద్
► సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా నిలిపివేత
► పూర్తయిన 4.5 టీఎంసీల నీటి విడుదల ప్రక్రియ
విజయపురి సౌత్ : నాగార్జునసాగర్ కుడి కాలువకు ఆదివారం నీటి సరఫరాను నిలిపేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం తీసుకోవటంతో గత నెల 23 నుంచి నీటి విడుదల కొనసాగింది. ఆదివారం వేకువజామున 3 గంటలకు 4.5 టీఎంసీల నీరు విడుదల పూర్తయింది. దీంతో 3,039 వేల క్యూసెక్కుల నీటి విడుదల వేగాన్ని గంటకు 1000 క్యూసెక్కుల చొప్పున తగ్గిస్తూ ఉదయం 6 గంటలకు పూర్తిగా సరఫరా నిలిపేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 507.90 అడుగుల వద్ద ఉంది. ఇది 128.1323 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 5,076, ఎస్‌ఎల్‌బీసీకి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ ఫ్లోగా 6,276 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.