నార్నూర్(ఆదిలాబాద్): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయడానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యను ఎస్‌వో ప్రియాంక సర్పంచ్ మెస్రం జైవంత్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment