
ప్రజాప్రతినిధులంటే పట్టింపులేదా?
- క్వార్టర్లలో సమస్యలనూ పట్టించుకోవడం లేదు
- అధికారులపై స్పీకర్,మండలి చైర్మన్ ఆగ్రహం
- సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ప్రజాప్రతినిధుల విషయంలో ప్రొటోకాల్ పాటించడంతోపాటు ఇతరత్రా అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారులు పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో బుధవారం స్పీకర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధుల విషయంలో అధికారుల తీరుపై సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్.. తొలుత తమ సమస్యలను, తమకు ఎదురైన అనుభవాలను ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
తమకు కేటాయించిన భద్రతా సిబ్బందిలో ఎవరెప్పుడు వస్తున్నారో, ఎపుడు పోతున్నారో, అసలు వారెవరో కూడా తెలియడం లేదని, తమ వద్ద మొత్తంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలియడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇక స్పీకర్, చైర్మన్లకు కేటాయించిన అధికారిక నివాసాలతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులు దృష్టి పెట్టడడం లేదని ఆగ్రహించినట్లు తెలిసింది. క్వార్టర్లకు నీటి సరఫరా లేదని ఫోన్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడని, తమ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీసినట్లు సమాచారం.
సమావేశంలో పాల్గొన్న వాటర్ బోర్డు అధికారుల నుంచి సమాధానం లేకుండా అయ్యిందని, ఇటీవల క్వార్టర్లలో నీళ్లు లేవని ఒక వీఐపీ ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, చివరకు డబ్బులు ఇస్తామని చెప్పాల్సి వచ్చిందని.. అయినా స్పందన లేదన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. తమ వద్ద ఉండే భద్రతా సిబ్బంది సహా ఇతర సిబ్బంది వివరాలను వెంటనే తమకు అందజేయాలని అధికారులను ఆదేశించారని తెలిసింది.