విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఉదయం భక్తులు నీటి కోసం వెంపర్లాడాల్సి వచ్చింది.
ఇంద్రకీలాద్రి: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఉదయం భక్తులు నీటి కోసం వెంపర్లాడాల్సి వచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా కరెంటు సరఫరా నిలిపివేయటం ఇందుకు కారణం. కనకదుర్గానగర్‌లో ఉదయం 9 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో నీటి పంపులు పనిచేయడంలేదు.
కనీసం మంచినీరు కూడా కరువైంది. తలనీలాలు ఇస్తున్నవారు, స్నానాలు చేసే వారు అవస్థలు పడుతున్నారు. నీళ్ల డబ్బాలు, ప్యాకెట్లు కొనుక్కుని అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే కరెంటు కోత విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు అంటున్నారు. ఉదయం 11 గంటల వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.