
ఎంబుక్‌లను పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌డీ శాంతో
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ప్రతి పనికీ ఓ రేటు విధించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో అతిడిని విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్లుగా నగరంలోని ఓ లాడ్జీలో ఉంటూ అవినీతి దందాను కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ఇసనాక సురేంద్రరెడ్డి నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు.
గతేడాది జూలై 22న, అక్టోబర్ ఒకటిన ¯ðనెల్లూరు నగరం 25వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ, ఇందిరమ్మ కొత్తకాలనీ, కనుపర్తిపాడు ఎస్సీ, బీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకర్‌ల ద్వారా నీటిని తోలేందుకు మూడు వర్క్‌ఆర్డర్లు సురేంద్రరెడ్డికి వచ్చాయి. దీంతో ఆయన నిర్దేశిత ప్రాంతాల్లో నీటిని సరఫరా చేశారు. కాలపరిమితి ముగియడంతో నీటి సరఫరా తాలూకా రూ.2,63,250 బిల్లు అతడికి రావాల్సి ఉంది. దీంతో ఆయన అదే ఏడాది డిసెంబర్‌లో పలుమార్లు ఎంబుక్‌ల్లో పనులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్‌లో వాటర్‌సప్‌లై, రోడ్స్ విభాగం ఏఈ బీఎస్ ఆంజనేయులరాజును కోరారు.
ఏఈ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. సురేంద్రరెడ్డి గతేడాది డిసెంబర్ 27న దుబాయిలో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే ఏఈని వివిధ ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు కుక్కలగుంటలోని కలరా హౌస్‌లోని వెహికల్స్ డిపో విభాగానికి బదిలీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సురేంద్రరెడ్డి దుబాయి నుంచి తిరిగి వచ్చి బిల్లుల విషయమై ఏఈని కలిసేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడినుంచి ఏఈని వేరే విభాగానికి మార్చాడని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన బాధితుడు ఏఈని కలిసి బిల్లుల విషయమై మాట్లాడాడు.
ఎంబుక్‌లు అతని వద్దనే..
ఏఈ వేరే విభాగానికి మారినా సురేంద్రరెడ్డి పనులకు సంబంధించిన ఎంబుక్స్ అతని వద్దనే ఉన్నాయి. పనులు తాలూకా వివరాలను ఎంబుక్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు ఏఈ పంపాల్సి ఉంది. అందుకు గానూ రూ.30 వేలు ఇవ్వాలని ఏఈ సురేంద్రరెడ్డిని డిమాండ్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నానని బాధితుడు చెప్పినా పట్టించుకోలేదు. ఈనెల రెండో తేదీన సురేంద్రరెడ్డి మరోమారు ఏఈని కలిసి ప్రాధేయపడ్డాడు. అయినా అతను కనికరించకపోగా రూ.30 వేలు ఇస్తేనే ఎంబుక్‌లను ఉన్నతాధికారులకు పంపుతానని తేల్చిచెప్పాడు. నాలుగైదురోజుల్లో నగదు ఇస్తానని చెప్పి బాధితుడు అక్కడినుంచి వచ్చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు అదేరోజు నెల్లూరు ఏసీబీ డీఎస్సీ సీహెచ్‌డీ శాంతోను కలిసి ఏఈపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన పత్రాలు, ఏఈతో మాట్లాడిన ఆడియో సంభాషణలకు సంబంధించిన సీడీలను డీఎస్పీకి అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు రూ.30 వేలు ఇస్తానని ఏఈకి తెలిపారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
గురువారం ఉదయం ఏఈ (కలరా హాస్‌లోని తన కార్యాలయంలో) రూ.30 వేలు సురేంద్రరెడ్డి వద్ద నుంచి లంచం తాలుకా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్కడే ఏఈకి రసాయన పరీక్షలు నిర్వహించారు. బీరువాలో ఉన్న ఎంబుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ లంచం తీసుకున్న వైనం
ఇదిలా ఉండగా సురేంద్రరెడ్డికి గతంలో రూ.8.40 లక్షలకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. అందుకు సంబంధించి ఎంబుక్‌లో వివరాలు నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపేందుకు ఇదే ఏఈ బాధితుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకున్నట్లు ఏబీబీ అధికారులు పేర్కొన్నారు. ఇలా పలువురి కాంట్రాక్టర్‌ల వద్ద నుంచి ఏఈ ముక్కుపిండి వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఎవరి ప్రమేయం ఉంది?
అక్రమ వసూళ్లలో తనతోపాటు ఉన్నతాధికారులకు వాటా ఉందని సదరు ఏఈ ఏసీబీ అధికారుల ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధమైయ్యారు. ఓ డీఈ అక్రమ వసూళ్లలో భాగస్తుడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. సదరు డీఈపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని తాజాగా పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఏఈ అరెస్ట్
అవినీతి ఏఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించారు. మామూళ్ల వెనుక ఉన్నతాధికారుల ప్రమేయంపై అతడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. శుక్రవారం ఏఈని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ శాంతో, ఇన్‌స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, రమేష్‌బాబు, శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఐదున్నరేళ్లుగా..
గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బీఎస్ ఆంజనేయులరాజు 2013 జూలైలో నెల్లూరు నగరపాలక సంస్థలో ఏఈగా బాధ్యతల్లో చేరాడు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆయన కార్పొరేషన్‌లోనే పనిచేస్తున్నారు. గతంలో వాటర్ సప్‌లై, రోడ్స్ విభాగంలో పనిచేశారు. ఈక్రమంలోనే పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అతడిపై పలు ఆరోపణలు వినిపించడంతో మూడునెలల క్రితం కలరా హౌస్‌లోని మున్సిపల్ వెహికల్స్ డిపోకు మార్చారు. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లను బెదిరించి వారి వద్దనుంచి సంతకాలను తీసుకుని డీజిల్ డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం ఏసీబీ అధికారులు సైతం గుర్తించినట్లు తెలిసింది. కాగా సదరు ఏఈ నగరపాలక సంస్థలో చేరిన నాటినుంచి బృందావనంలోని లాడ్జీలో ఉంటున్నాడు. అనధికార కార్యకలాపాలను లాడ్జీ నుంచే నడిపిస్తున్నాడని అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment