నీటి కొరత రానివ్వం
జలమండలి ఎమ్‌డీ దానకిశోర్ బాధ్యతలు స్వీకరణ
సిటీబ్యూరో: ప్రస్తుత వేసవిలో జలమండలి పరిధిలో ఉన్న నల్లా కనెక్షన్లకు కొరత లేకుండా నీటిని సరఫరా చేస్తామని బోర్డు నూతన మేనేజింగ్ డెరైక్టర్ దానకిశోర్ తెలిపారు. గురువారం ఆయన ఏసీ గార్డ్స్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ఎమ్‌డీగా బాధ్యతలు స్వీకరించారు. 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన... 20 ఏళ్లుగా అనేక కీలక పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహా నగర దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉన్నందున వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. మెరుగైన సేవలందించడం, కలుషిత జలాలు, అరకొర నీటి సరఫరా, ట్యాంకర్లు, మురుగు సమస్యలపై అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడమే తన ధ్యేయమన్నారు. దాహార్తితో సతమతమవుతున్నప్రాంతాలకు అదనంగా 70 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సుదీర్ఘ నిరీక్షణ లేకుండా చూస్తామన్నారు. వినియోగదారులకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
వరుస సమీక్షలు.. విస్తృత తనిఖీలు
బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎమ్‌డీ దానకిశోర్ గురువారం సమీక్షలు, విస్తృత తనిఖీలతో బిజీగా గడిపారు. కలుషిత జలాలతో సతమతమవుతున్న మాదాపూర్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని వివిధ కాలనీలు, బస్తీలను సందర్శించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని తక్షణం పరిష్కరించాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టు పనులు, వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నిర్వహణ పనులు, రెవెన్యూ ఆదాయం పెంపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
డేటా బ్యాంక్ సిద్ధం చేయండి
గ్రేటర్ పరిధిలో మంచినీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఉన్న, లేని ప్రాంతాలపై సమగ్ర డేటా బ్యాంక్ (సమాచార నిధి) సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డెరైక్టర్ కొండారెడ్డి, రెవెన్యూ డెరైక్టర్ సత్యసూర్యనారాయణ, ఆపరేషన్స్ డెరెక్టర్ రామేశ్వరరావు, ఎల్లాస్వామి, సీజీఎం శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.