ఎట్టకేలకు పట్నంలో భగీరథ !
- 24 పట్టణాల్లో రూ.548 కోట్లతో పనులు
- ఆన్యూటీ పద్ధతిలో పనులు దక్కించుకున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్
- త్వరలో మరో 19 నగర పంచాయతీల్లో కూడా..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఇంటింటికి రక్షిత నీటి సరఫరా పనుల కోసం యాన్యూటీ ( Annuity) పద్ధతిలో రూ.548 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లను రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. యాన్యూటీ విధానంలో తొలిసారి నిర్వహించిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం పలు సడలింపులతో రెండో సారి టెండర్లు నిర్వహించగా, మెగా ఇంజనీరింగ్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి ప్రాజెక్టు పనులు అప్పగిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 నెలల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసేందుకు సదరు కంపెనీతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ శాఖ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పాల్వంచ, సత్తుపల్లి, ఎల్లెందు, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, జనగాం, గద్వాల, నారాయణపేట, వనపర్తి, భువనగిరి, తాండూరు, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి పట్టణాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ పనులను ఈ సంస్థ చేపట్టనుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ రూ.548 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఏడేళ్ల కాల వ్యవధిలో ఈ సంస్థకు ప్రభుత్వం వడ్డీతో సహా రూ.1,100 కోట్ల బిల్లులను తిరిగి చెల్లించనుంది. ఏడేళ్ల పాటు ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను నిర్మాణ సంస్థే పర్యవేక్షించనుంది. ఏడేళ్ల గడువు ముగిసిన తర్వాత ప్రాజెక్టులను ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది.
మరో 19 నగర పంచాయతీల్లో..
మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని మరో 19 నగర పంచాయ తీల్లో నీటి సరఫరా పథకాల నిర్మాణం కోసం త్వరలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లను ఆహ్వానించనుంది. గత నాలుగేళ్ల కాలంలో గ్రామ పంచా యతీ నుంచి నగర పంచాయతీ స్థాయికి అప్‌గ్రేడ్ అయిన ఈ పురపాలికల్లో తాగునీటి సరఫరా పథకాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగర పంచాయతీలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు దాదాపు రూ.650 కోట్ల అంచనా వ్యయంతో ఆన్యూటీ విధానంలోనే టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఆహ్వానిస్తామని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పనులను సైతం 18 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.