జలదరింపు
సంగారెడ్డి మున్సిపాలిటీ : వర్షాకాలంలోనూ మెతుకుసీమ పట్టణాల గొంతెండుతోంది. సరిపడా నీటి సరఫరా లేక పుర ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. మునిసిపాలిటీల పరిధిలో జల వనరుల నుంచి తగినంత నీటి లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యల వైపు దృష్టి సారించాల్సి ఉంది.
జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల పరిధిలో 29 వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉండగా, రోజూ 44.26 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) చొప్పున మంచినీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం సరఫరా రోజూ 31.18 ఎంఎల్‌డీలకు మించడం లేదు. కొత్తగా ఏర్పడిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీతో పాటు మరో ఐదు మునిసిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్ మునిసిపాలిటీలకు మంజీరతో పాటు స్థానిక వనరుల నుంచి మంచినీటిని పంపింగ్ చేస్తున్నారు. గజ్వేల్‌లో పాండవుల చెరువు, సిద్దిపేటలో లోయర్‌మానేర్ రిజర్వాయర్, సదాశివపేటలో మెట్రో వాటర్‌వర్క్స్ విభాగం ద్వారా నీరందుతోంది. ఈ ఏడాది 9 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కావడంతో ఆయా వనరుల్లో నీరు చేరలేదు. దీంతో జహీరాబాద్, సిద్దిపేట, సదాశివపేట మునిసిపాలిటీల్లో తాగునీటి అవసరాలకు పవర్‌బోర్లే గతవుతున్నాయి.
ట్యాంకర్ల ద్వారా అంతంతే..
సంగారెడ్డి మునిసిపాలిటీకి మంజీర రిజర్వాయర్ నుంచి రోజూ 10 ఎంఎల్‌డీల నీరు సరఫరా చేస్తున్నా, సాంకేతిక కారణాలతో అన్ని ప్రాంతాలకు అందడం లేదు. వర్షాకాలంలో నీటి పాట్లు ఎదురు కావడంపై పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్, సిద్దిపేట, సదాశివపేట మునిసిపాలిటీల్లో ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా తాగునీరందించేందుకు చర్యలు చేపట్టడం పరిస్థితికి అద్దం పడుతోంది.
సంగారెడ్డి పట్టణానికి నీళ్లు బంద్
మంజీర బ్యారేజ్‌లో నీటిమట్టం పూర్తిగా అడుగంటిపోయింది. జిల్లా కేంద్రానికి మంజీర నీళ్లందడం లేదు. అధికారులు బోర్ నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టులో సైతం నీళ్లు లేకపోవడంతో పట్టణానికి అవసరమైన నీటి సరఫరాలో కోత పడింది. ప్రస్తుతం సింగూర్‌లో నీటిమట్టం 03.30 టీఎంసీల మేరకే ఉంది. దీంతో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరింది.