కరువుపై ఇంత నిర్లక్ష్యమా?
♦ ప్రజలు అల్లాడుతుంటే సహాయక చర్యలేవీ?
♦ ప్రజల కష్టాలపై పత్రికల్లో కథనాలు సర్కారుకు కనిపించడం లేదా?
♦ ఇవన్నీ టీడీపీ అఫీషియల్ గెజిట్ ‘ఈనాడు’లో వస్తున్న కథనాలే
♦ తాగునీటికి అరకొర కేటాయింపులేనా?
♦ శాసన సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్షం వాకౌట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు వల్ల పనుల్లేక కూలీలు, రైతులు వలస వెళుతున్నా, తాగునీరు లభించక ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం కనీస సహాయక చర్యలు చేపట్టడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సర్కారు తీరును ఎండగట్టారు. కరువు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు కరువుపై వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. సభలో ఆయన ఏం చెప్పారంటే...
ప్రభుత్వం చేస్తున్నదేమిటి?
‘‘ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని రాష్ట్ర సర్కారు చెబుతోంది. పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. తుపాను వల్ల కొన్ని జిల్లాల్లో భూగర్భ జలమట్టం కొద్దోగొప్పో పెరిగిందే తప్ప చాలా జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ప్రతిరోజూ పత్రికల్లో ఫొటోలతో సహా రాస్తున్నారు. జిల్లాల్లో ఉపాధి పనులు దొరక్క రూ.100 కోసం వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని పత్రిల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. (ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది అంటూ పత్రికా కథనాల క్లిప్పింగులను చూపుతుండగా టీడీపీ సభ్యులు ‘సాక్షి’ అంటూ కామెంట్లు చేయడంతో.. కాదు సర్! అన్నీ మీ అఫిషియల్ గెజిట్ ‘ఈనాడు’లో వచ్చిన కథనాలే, వేరేవి ఏమీ చదవడం లేదు అని జగన్ స్పష్టం చేశారు) రాష్ట్రంలో ఇంతటి దారుణమైన కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం చేస్తున్నదేమిటి?
చేతులారా నష్టం చేసుకున్నాం
ఎన్యూమరేషన్ ప్రక్రియను ముందుగానే పూర్తిచేసి 2015- 16కు సంబంధించి కరువు మండలాలను అక్టోబర్ 5వ తేదీలోగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం 2015 అక్టోబర్ 27న మొదటి విడతగా 196 కరువు మండలాలను ప్రకటించింది. నవంబర్ 21న మరో 163 కరువు మండలాలను ప్రకటించింది. అక్టోబర్ 5లోగా పూర్తి చేయాల్సిన ప్రక్రియలను నవంబర్ 21 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. దీనివల్ల మనం రూ.2,343 కోట్ల కరువు సాయం అడిగితే కేంద్ర ప్రభుత్వం ఒకదఫా రూ.433 కోట్లు, మరో దఫా రూ.283 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే మనం చేతులారా నష్టం చేసుకున్నాం. 2015 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ ఒక్క రూపాయంటే రూపాయి కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. ఇంతకంటే దారుణం ఏదీ ఉండదు.
ఆ కేటాయింపులు సరిపోతాయా?
మంచినీటి సరఫరా కోసం గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్)కైనా కేటాయింపులు చేశారా? అంటే అది ఇంకా దారుణంగా ఉంది. పార్నపల్లె లిఫ్ట్ ద్వారా పులివెందుల నియోజకవర్గానికి తాగునీరు సరఫరా అవుతోంది. అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతుంటే నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌కు అరకొర కేటాయింపులు చేయడాన్ని ఏమనుకోవాలి? అనంతపురం జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.155 కోట్ల బకాయిలు ఉంటే ప్రభుత్వం రూ.10 కోట్లే విడుదల చేసింది. జిల్లాలకు కేటాయింపులను చూస్తే పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. మంచినీటి సరఫరా కోసం ఈ కేటాయింపులు ఏరకంగా సరిపోతాయి? ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’’ (ప్రసంగం ముగించి విపక్ష నేత జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు).