ప్రజలకు బాసటగా ‘సాక్షి’
► లింగంపల్లి దళితకాలనీలో ట్యాంకర్లతో నీటి సరఫరా ప్రారంభం
► ముందుకొచ్చిన దాత ముక్కెర తిరుపతిరెడ్డి
► వేసవి కాలం ముగిసే వరకూ కొనసాగింపు..
జనగామ : జిల్లాలో కరువుకు కేరాఫ్‌గా మారిన జనగామ నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఈ సమస్య తీర్చాలని ‘సాక్షి’ సంకల్పించింది. సేవా దృక్పథం గల దాతలను సంప్రదించింది. బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త, టీఆర్‌ఎస్ నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి సహకారం కోరింది. ఆయన సరేననడంతో లింగంపల్లి గ్రామంలోని దళిత కాలనీ నుంచి తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. పది వార్డులు.. సుమారు 3500 జనాభా ఉన్న లింగంపల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ రోజుకు 5,500 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్‌తో వేసవి కాలం పూర్తయ్యే వరకు తాగునీరందిస్తానని తిరుపతిరెడ్డి చెప్పారు.
అల్లాడుతున్న లింగంపల్లి
లింగంపల్లి గ్రామంలో దళితవాడలో 80 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కాలనీలో మూడు బోర్లు వేసినా, భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోవడంతో సరిపడా నీరు రావడం లేదు. వీధినల్లా గంటకోసారి రెండు మూడు నిమిషాలు వచ్చి ఆగిపోతోంది. ఇలా నీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. వృద్ధులు, పిల్లలు మంచినీటి కోసం ఎండలో ఉంటూ వడదెబ్బకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు సాక్షి ప్రత్యేక చొరవ చూపగా, ముక్కెర తిరుపతిరెడ్డి ముందుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు కిష్టయ్య, వార్డుసభ్యులు బండి వరలక్ష్మి నర్సింహులు, ఎం.కమలాకర్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దొంతుల మహేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఇమ్మడి సంతోష్, బి.మధు, కొత్తపల్లి రాము, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ క్రిష్ణగోవింద్, వరంగల్ పశ్చిమ ఇంచార్జి కె.క్రిష్ణకుమార్, జనగామ ఆర్‌సీ ఇంచార్జి కొత్తపల్లి కిర ణ్‌కుమార్, బచ్చన్నపేట రిపోర్టర్ బిక్షపతి పాల్గొన్నారు.
గొంతెండుతున్న ప్రజల దాహార్తి తీరుస్తా
వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వేసవి ముగిసేందత వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని ‘సాక్షి’ దినపత్రిక వారు నన్ను సంప్రదించారు. దీంతో లింగంపల్లి గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టాం. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో ఇది కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది. - ముక్కెర తిరుపతిరెడ్డి