పట్టణాలు కటకటా!
* తాగునీటి కోసం అల్లాడుతున్న పురజనులు
* నిండు వర్షాకాలంలోనూ గుక్కెడు నీటికి కరువు
* చాలా చోట్ల మూడు నాలుగు రోజులకోసారి నీటి సరఫరా
* 68 పట్టణాల్లోనూ ఇదే గోస 17 పట్టణాల్లో ఆందోళనకర స్థితి
* రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం
* అడుగంటిన జలాశయాలు.. ఎండిపోయిన నదులు, వాగులు
* పాతాళానికి చేరిన భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్నవాసుల గొంతెండిపోతోంది... దాహం దాహం అంటూ పురజనులు అల్లాడిపోతున్నారు.. నిండు వర్షాకాలంలోనూ గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.. గత వేసవిలోనే అడుగంటిన జలాశయాలు, వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయినా జాడలేని వానలే ఈ దుస్థితికి కారణం. రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర కరువు ముంచుకొస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయినా వర్షాల ఊసేలేదు. జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలూ దాదాపు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలే కాదు కృష్ణా, గోదావరి నదులూ ఎండిపోయి కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరులోగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడనుంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ సహా 68 పురపాలక సంస్థలు ఉండగా... 17 పట్టణాలు ఇప్పటికే నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో నాలుగైదు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన నగర, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్ కొద్దిరోజులుగా సమస్యాత్మక పట్టణాల్లో పర్యటిస్తూ, పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని... ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.16 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు.
డెడ్ స్టోరేజీలో జలాశయాలు..
రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న జూరాల, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, సింగూరు, దిగువ మానేరు, పానగల్ ఉదయ సముద్రం, ఎల్లంపల్లి తదితర జలాశయాల్లో నీటి నిల్వలు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. మరో నెల, నెలన్నర వరకై సరఫరా చేసేందుకు ఈ నిల్వలు సరిపోతాయో లేదోనని అధికారులే పేర్కొంటున్నారు. అప్పటికి వర్షాలు కురవకపోతే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పట్టణాలకు కష్టమే!
రాష్ట్రంలోని 17 పట్టణాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న జల వనరులు ఈ నెలాఖరులోగా పూర్తిగా అడుగంటనున్నాయని పబ్లిక్ హెల్త్ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆదిలాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, హుస్నాబాద్, జగిత్యాల, జనగాం, కొల్లాపూ ర్, కోరుట్ల, కొత్తగూడెం, మధిర, మంచి ర్యాల, మణుగూరు, మెదక్, నర్సంపేట, పా ల్వంచ, వేములవాడ, ఇల్లెందు పట్టణాలకు తా గునీటి అవసరాలు తీర్చుతున్న జల వనరులు 30 రోజుల్లోగా వట్టిపోతాయని పేర్కొంది.
‘బోరు’మంటున్న భూగర్భం
రాష్ట్రంలోని 16 చిన్న పట్టణాలకు భూ ఉపరితల నీటి సరఫరా వ్యవస్థ లేదు. భూగర్భ జలాలపై ఆధారపడే ఈ పట్టణాల్లో తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం భూగర్భ జలాలూ అడుగంటిపోవడంతో ఈ పట్టణ ప్రాంతాల్లో 272 నీటి సరఫరా బోర్లు ఎండిపోయాయి. దీంతో కొద్దికొద్దిగా నీరు వస్తున్న బోర్ల నుంచి నాలుగైదు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు.