అధికారులను హెచ్చరించిన సీఎం సిద్ధరామయ్య
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు పంపండి
మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం
15 రోజుల్లోగా ఇన్‌పుట్ సబ్సిడీ
బళ్లారి : వేసవిలో ప్రజల గొంతులెండితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా, లేదా కొత్త బోర్లు తవ్వించి యుద్ధప్రాతిపదికన నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరువు పరిహార పరిశీలన, మంచినీటి సమస్యపై బీదర్‌లోని జిల్లా పంచాయతీ సభామందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. బీదర్ జిల్లాలో మూడేళ్లుగా కరువు నెలకొందని, అందువల్ల ప్రజలకు అత్యవసర మంచినీటిని అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మంచి నీరందించేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, విపత్తు నిర్వహణ నిధి కింద విడుదల చేసిన నిధులను వినియోగించాలని ఆయన జిల్లాధికారి అనురాగ్ తివారీకి సూచించారు. జిల్లాలో మొత్తం 881 గ్రామాలుండగా, 789 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొందన్నారు. ఈ గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు విృ్తత సూక్ష్మ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని ఆయన జెడ్పీ సీఈఓ పవన్ కుమార్ మాలపాటిని ఆదేశించారు.
మంచినీటి సమస్య నివారణకు జిల్లా, తాలూకా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, అక్కడి ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి వారానికొకసారి రెవెన్యూ శాఖ కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని జిల్లాధికారిని ఆదేశించారు. వచ్చే నెలలో పశుగ్రాసం, నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నందున అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని 15 రోజుల్లోగా సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కృష్ణభైరేగౌడ, కన్నడ సంృ్కతీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉమాశ్రీ, బీదర్ ఎంపీ భగవంత్ ఖూబా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్ జాదవ్, ఎమ్మెల్యేలు రహీంఖాన్, ఈశ్వర్ ఖండ్రె, రాజశేఖర్ పాటిల్, ప్రభు చౌహాన్, మల్లికార్జున ఖూబా, ఎమ్మెల్సీ విజయ్ సింగ్, గొర్రెల ఉన్ని అభివృద్ధి మండలి అధ్యక్షుడు పండిత్ చిద్రి, ద్రాక్షరస అభివృద్ధి మండలి అధ్యక్షుడు బక్కప్ప కోటె, ప్రాంతీయ కమిషనర్ ఆదిత్య బిస్వాస్, జిల్లాధికారి అనురాగ్ తివారీ, ఎస్పీ ప్రకాష్ నిక్కం, జెడ్పీ సీఈఓ పవన్‌కుమార్ మాలపాటిలతో పాటు జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.