నీరుగారిన లక్ష్యం
ప్రజల దాహార్తి తీర్చని ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకం
కందుకూరు మండలంలో 8 గ్రామాలు, ఉలవపాడులో 6 గ్రామాలకు అందని నీరు
* 10 కోట్లు ఖర్చు చేసినా నెరవేరని పాలకుల లక్ష్యం
మెయింటెనెన్స్ ఖర్చు నెలకు * 90 వేలకుపైనే
అధికారులు, కాంట్రాక్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : వేసవి ముంచుకొస్తోంది. మంచినీటి పథకాలు మరమ్మతులకు గురై ప్రజలు అల్లాడుతున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. మూలకు చేరిన మోటార్లు, పైపులైన్ల పునరుద్ధరణకు కాంట్రాక్టర్ల చర్యలు శూన్యం. పథకాల మెయింటినెన్స్ ఖర్చుల పేర నిధులు మాత్రం కొంద రి జేబుల్లోకి వెళ్తున్నాయి.
ప్రజల దాహార్తి తీర్చడంతో అటు అధికారులు, ఇటు పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. భారీ మంచినీటి ప్రాజెక్టు రాకతో పంచాయతీల్లోని మంచినీటి పథకాలు మూలనపడ్డాయి. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, కందుకూరు మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు * 10 కోట్లతో నిర్మించిన ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకం నిరుపయోగంగా మారుతోంది. మోటార్లను సకాలంలో మరమ్మతులు చేయించడంలో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇదీ.. పథకం లక్ష్యం
ఉలవపాడు, కందుకూరు మండలాల్లోని 42 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసేందుకు ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలోని చినిగేవారిపాలెం సమీపంలో మన్నేరు వద్ద మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఉలవపాడు మండలంలో 34, కందుకూరు మండలంలో 8 గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 2011లో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభం నుంచి మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడి పైపులైన్లు సక్రమంగా నిర్మించకపోవడంతో కరేడు పంచాయతీలోని కొన్ని గ్రామాలకు నీటి సరఫరా తొలి నుంచే నిలిచిపోయింది.
ఇలా ఉలవపాడు మండలంలో సుమారు 6 గ్రామాలకు ఇప్పటి వరకూ నీరు సరఫరా కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ట్యాంకులు నిర్మించినా నీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పైపుల నిర్మాణం సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
అలంకారప్రాయంగా ట్యాంక్‌లు
కందుకూరు మండలంలో ఆనందపురం, శ్యామీరపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకార ప్రాయంగానే మిగిలాయి. 2011లో ట్యాంకు నిర్మిస్తే ఇప్పటి వరకూ చుక్క నీరు ట్యాంక్‌కు ఎక్కలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారురు.
వాస్తవానికి అన్ని బజార్లలో పైపులు వేయాల్సి ఉండగా అరకొర వేసి మమ అనిపించారు. ఆనందపురం, చుట్టుగుంట, గళ్లవారిపాలెం, దివివారిపాలెం, గనిగుంటలలో నిర్మించిన ట్యాంక్‌ల పరిస్థితీ అంతే. దివివారిపాలేనికి అరకొర నీరు వస్తున్నా సరఫరా సక్రమంగా లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక గనిగుంటలోని ఓవర్‌హెడ్ ట్యాంకుకు పైపుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.
నెలనెలా ఖర్చు తడిసి మోపెడు: పథకం మెయింటినెన్స్‌కు నెలకు * 90 వేలకుపైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులను పథకం ఆపరేటర్, ఆయా గ్రామాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల వద్ద వారికి జీతాలు, పైపులైన్ల మరమ్మతులకు ఖర్చు చేస్తున్నారు. కందుకూరు మండలంలోని ఎనిమిది గ్రామాలకు పైపు లైన్లు సక్రమంగా లేవు. లీకులతో నీరు వృథా అవుతోంది.
20 రోజుల నుంచి నిలిచిన నీటి సరఫరా
మన్నేరులో నిర్మించిన పథకానికి సంబంధించిన మోటార్ల మరమ్మతులకు గురయ్యాయి. 20 రోజులు గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఉప్పునీటినే తాగే పరిస్థితి ఏర్పడింది.
మరమ్మతులు చేయిస్తున్నాం: రాజశేఖర్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, ఉలవపాడు
పథకానికి సంబంధించిన మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని ఎప్పటికప్పుడు బాగు చేయిస్తున్నాం. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తవుతాయి. పథకం పరిధిలోని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయిస్తున్నాం.