
చెన్నైకి రెండు టీఎంసీల నీళ్లివ్వండి
సాక్షి, అమరావతి: వేసవిలో రానున్న నీటి ఎద్దడిని పరిగణనలోకి తీసుకుని చైన్నైకు రెండు టీఎంసీల నీటిని సరఫరా చేయాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అక్కడి వివరాలతో కూడిన విజ్ఞాపనాపత్రాన్ని రాష్ట్ర సీఎం చంద్రబాబుకు అందించారు. ఆయన గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో బాబును కలుసుకుని చైన్నైలోని తాగునీటి ఎద్దడిని వివరించారు. నగరానికి నీరందించే నాలుగు జలాశయాలు అడుగంటాయని, ఇప్పటినుంచే చర్యలు తీసుకోకపోతే వేసవిలో తాగునీటిని అందించలేమని తెలిపారు. మానవతా దృక్పథంతో చెన్నైకు రెండు టీఎంసీల నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏపీ చేసిన సాయాన్ని మర్చిపోలేమని, ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధిని సాధిద్దామని తెలిపారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... ఇరు రాష్ట్రాల అధికారులు నీటి అవసరాలపై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుందామన్నారు. ఏపీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని 25 శాతంకు పైగా తక్కువ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. దీనికితోడు కండలేరు ప్రాజెక్టు ఉన్న నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వారం రోజుల్లోపే ఇరు రాష్ట్రాల అధికారులు తిరుపతిలో సమావేశం కావాలని సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్‌తో ప్రభుత్వం కొనసాగుతోందని, నీటి సరఫరాకు సంబంధించి గతం నుంచి తమిళనాడు చెల్లించాల్సిన రూ.413 కోట్ల బకాయిలను చెల్లించాలని కోరారు.