
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంలో ప్రధాన భాగమైన దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనాన్ని నిలువరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. దక్షిణాదికి ప్రత్యేకంగా రాజధాని కావాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీని స్థాపించిన తరువాత బుధవారం తొలిసారిగా చెన్నైకి వచ్చి మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘దేశాన్ని ఎంతోకాలంగా ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ శాసిస్తున్నాయి. ఇకనైనా ఈ పద్ధతి మారాలి. దక్షిణాదిలోని రాజకీయ నేతలంతా సంఘటిత శక్తిగా ఎదగాలి. దేశానికి మరో రాజధాని అవసరమన్న బాబాసాహేబ్ అంబేడ్కర్ కలలను నిజం చేసుకోవాలి’ అని పవన్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు మరో రాజధాని సాధన కోసం తన ప్రయత్నాన్ని చెన్నై నుంచే ప్రారంభించానని, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నేతలను కలిసి దక్షిణాదికి కలుగుతున్న నష్టాన్ని వివరిస్తానని ఆయన తెలిపారు.
టీడీపీతో చెలిమి ప్రమాదకరం: అవకాశవాద రాజకీయాలకు చిరునామాగా మారిన చంద్రబాబుతో చెలిమి ఎవరికైనా ప్రమాదకరమేనని పవన్‌కల్యాణ్ అన్నారు. ‘విభజన వల్ల నష్టపోయిన ఏపీకి మేలు జరగాలనే సంకల్పంతోనే బీజేపీ, టీడీపీకి మద్దతు పలికాను. అయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రోహం చేశారు.’ అని వవన్ తెలిపారు. ‘కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని తన కుమారుడు నారా లోకేష్‌ను పంచాయతీరాజ్ మంత్రిగా చేశాడు చంద్రబాబు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేస్తుంది. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా ఏపీ ముఖ్యమంత్రిని అవుతాను. దేశ రాజకీయాల్లో జనసేన కీలకంగా మారుతుంది’ అని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలు అసత్యాలన్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని అయితే ఎంతో ఓర్పు సహనం అవసరమని నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి అన్నారు.