సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్(గుంటూరు): పచ్చమీడియాకు అతిసారం సోకినట్టుంది. గుంటూరు నగరంలో కలుషిత జలం కాటేసిందంటూ మరోసారి విషాన్ని విరజిమ్మింది. తప్పుడు కథనాలతో పేట్రేగిపోయింది. చికెన్‌పాక్స్, న్యూమోనియా కారణాలతో శుక్రవారం మరణించిన మహ్మద్ ఇక్బాల్ డయేరియాతో మరణించాడని దుష్ప్రచారానికి దిగింది. గత వారంలో మరణించిన పద్మ మరణంపైనా ఇలాగే రాక్షస రాతలు రాసింది. గుంటూరులో నివాసం ఉంటున్న మహ్మద్ ఇక్బాల్ ఈ నెల 11న సాయంత్రం విరేచనాలు , వంటిమీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి.
పొక్కులను చికెన్‌పాక్స్‌గా వైద్యులు గుర్తించారు. బ్లడ్‌షుగర్ లెవల్స్ కూడా 400 దాటి ఉండటంతో డెర్మటాలజీ డాక్టర్లు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో చేరాలని సూచించారు. ఇక్బాల్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. జీజీహెచ్‌లోనూ ఉండకుండా వెళ్లిపోయాడు. రెండురోజల తర్వాత 15న న్యూమోనియా లక్షణాలతో ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా వైద్యులు జ్వరాల ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా వెళ్లలేదు. ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికెన్‌పాక్స్, న్యూమోనియా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ జీజీహెచ్‌కు వచ్చాడు.
వచ్చిన అరగంటలోనే మృతి చెందాడు. వైద్యులు చికెన్‌పాక్స్, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో చనిపోయాడని నివేదిక ఇచ్చారు. కుటుంబ సభ్యులు భీమవరం వెళ్లడంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు వారితో ఫోన్‌లో మాట్లాడారు. వారు కూడా అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుడు ఇక్బాల్ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఎక్కడా నీరు కలుషితం కాలేదని నివేదికలొచ్చాయి.
గుండెపోటుతోనే పద్మ మరణం
ఈనెల 10న మరణించిన ఎం.పద్మ(18) కూడా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండురోజుల పాటు ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఆఖరి ఘడియల్లో జీజీహెచ్‌లో చేరింది. అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుతో మృతి చెందింది.
కలుషిత నీరైతే ఒకరిద్దరే జబ్బున పడతారా?
కలుషిత నీరైనా, అతిసారం అయినా ఒకరిద్దరే జబ్బున పడరని వైద్యులు చెబుతున్నారు. ఆ కలుషిత నీరు తాగిన అందరూ రోగం బారిన పడతారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఒక వేళ కలుషిత నీటి వల్ల ఇక్బాల్, పద్మ జబ్బు బారిన పడితే వారి కుటుంబాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఎల్లోవీుడియా వద్దగానీ, టీడీపీ నేతల వద్దగానీ సమాధానం లేదు.
అధికారులు అప్రమత్తం
ఎల్లోవీుడియావి కట్టుకథలే అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల పది నుంచి నగరంలో రోజుకు వెయ్యికిపైగా తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం అయినట్లు ఆధారాలు దొరకలేదు. మినరల్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రీజనల్ మెడికల్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. పలు ఆర్‌ఓ ప్లాంట్లలో ఉండాల్సిన పీహెచ్ కన్నా తక్కువ ఉండటం, బ్యాక్టీరియా ఉండడాన్ని గుర్తించారు. వీటిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని రీజినల్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పచ్చమీడియా రెచ్చిపోతోంది.
స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం
గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం. కొన్ని పత్రికలు రాజకీయ అజెండాతో కలుషిత జలాలు అంటూ విషం చిమ్ముతున్నాయి. రైలుపేటకు చెందిన ఇక్బాల్ చికెన్‌పాక్స్, న్యూమోనియాతోనే చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులూ, జీజీహెచ్ వైద్యులూ ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో గుంటూరు నగరంలో 27 మంది అతిసారంతో మృతి చెందారు.
అప్పట్లో జీజీహెచ్‌లో రెండు వేల మంది చికిత్స తీసుకున్నారు. డయేరియా అయితే వందల మంది ఆస్పత్రుల పాలవుతారు. ప్రజలకు సరఫరా చేసిన ప్రతినీటిబొట్టునూ పరీక్షించిన తర్వాతే కుళాయిలకు వదులుతున్నాం. సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని ముందే సూచించాం. ఇంటింటి ప్రచారమూ చేపట్టాం. రీజనల్ మెడికల్ ల్యాబ్ నివేదిక మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోల్ శాఖకు లేఖ రాశాం. – మీడియాతో మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తిచేకూరి, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు
Comments
Please login to add a commentAdd a comment