సాక్షి, అమరావతి: కృష్ణా-గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని రైతాంగం, ప్రజలు సాగునీరు, తాగునీటికి ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని తెలిపారు.
ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు తాగునీటి, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో 480 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా ఇరు రాష్ట్రాలకు పారించాలని భావిస్తున్నామని, ఇరు రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి ప్రయత్నానికి నాంది పలుకబోతున్నారని, దీనిని అందరూ స్వాగతించాలని కోరారు. మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ.. ఈ ద్వైపాక్షిక ప్రాజెక్టు విషయంలో ఒప్పందాలు ఉంటాయని, రైతాంగానికి, తాగునీరు భవిష్యత్తులో ఇబ్బంది పడకూదని ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నారని అన్నారు. గతంలో మీరు పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకున్నారు కాబట్టి భవిష్యత్తులోనూ గొడవలు ఉంటాయని, తెలంగాణ ప్రజలు మనకు శాశ్వత శత్రువులనే నెగటివ్ దృక్పథంతో దీనిని చూడవద్దని టీడీపీ నేతలను మంత్రి అనిల్‌కుమార్ కోరారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల డిజైన్ ద్వారా ఏపీలో సాగునీటి, తాగునీటి కొరతను నివారించడానికి ఈ చర్చను చేపట్టామని, ఈ విషయంలో అందరి సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment