- వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా 4 ప్యాకేజీల అంచనాలు సిద్ధం
- ఫిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులకు రూ.3,560 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ మొత్తాన్ని 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. ఫిబ్రవరి రెండో వారానికి టెండర్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. నిజానికి ఖమ్మం జిల్లాలో 5 లక్షలకు ఎకరాలకు నీరిచ్చేందుకు రూ.7,926 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో తొలి దశలో దుమ్ముగూడెం నుంచి 39వ కిలో మీటర్ కెనాల్ వరకు సీతారామ ప్రాజెక్టు పనులను 3 ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు.
మొదటి కిలోమీటర్ ప్రాంతం ఉన్న అమ్మవారిపల్లి నుంచి బీజీ కొత్తూరు వరకు ఉన్న 10.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్‌కు మొదటి ప్యాకేజీని రూ.1,455 కోట్లు, బీజీ కొత్తూర్ నుంచి వేపలగడ్డ(32వ కిలోమీటర్) వరకు రెండో ప్యాకేజీని రూ.317 కోట్లు, వేపులగడ్డ నుంచి కోయగుట్ట వరకు(39.9వ కిలోమీటర్) వరకు రూ.254 కోట్లతో టెండర్లు పిలిచి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ప్యాకేజీ–2, 3 పనులను ఏజెన్సీలు ఆరంభించగా, మొదటి విడత పనులు మొదలవ్వాల్సి ఉంది. ఈ సమయంలోనే 39.9వ కిలోమీటర్ నుంచి 114.5 కిలోమీటర్ వరకు ప్రస్తుతం సర్వే సంస్థ వ్యాప్కోస్ ఇచ్చిన నిఏదిక ఆధారంగా అంచనాలు సిధ్దమయ్యాయి.
ఇందులో ప్యాకేజీల–4, 6లోని కోయగుట్ట, కమలాపురం పంప్‌హౌజ్‌ల అంచనాలు పూర్తి స్థాయిలో సిధ్దమవ్వాల్సి ఉండగా, మిగతా ప్యాకేజీలు 5,7,8,9ల అంచనాలు పూర్తయ్యాయి. ఇందులో ప్యాకేజీ–5 రూ.418కోట్లు, ప్యాకేజీ–7 (59.07వ కి.మీ నుంచి 83 కి.మీ వరకు)రూ.382.74కోట్లు, ప్యాకేజీ–8(83 కి.మీ. నుంచి 110కి.మీ.వరకు) రూ.537.41, ప్యాకేజీ–9 (110.42 నుంచి114.5 కి.మీ వరకు) రూ.176.59 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ప్యాకేజీ–9లో 110.4వ కిలోమీటర్ నుంచి 112.42 కిలోమీటర్ వరకు రెండు కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ఈ నాలుగు ప్యాకేజీలకు పంప్‌హౌస్ కింద వేసిన ప్రాధమిక అంచనా కలిపితే మొత్తంగా రెండోదశ రూ.3,560 కోట్లు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఆ పంప్‌హౌస్‌ల వ్యయం కచ్చితంగా తెలిసిన వెంటనే వచ్చే పిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచేలా అధికారుల కసరత్తు జరుగుతోంది.