Vyapkos report
-
పోలవరం కుడికాలువ వెడల్పు పెంపు!
సాక్షి, అమరావతి: సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి కనిష్ట వ్యయంతో దుర్భిక్ష ప్రాంతాలకు గరిష్టంగా తరలించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వ్యాప్కోస్ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసిన అధికారులు పనుల వ్యయాన్ని తగ్గించి రాయలసీమతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అధిక పరిమాణంలో వరద నీటి తరలింపు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇరువైపులా వెడల్పు పెంపు! పోలవరం కుడి కాలువ వెడల్పు 85 మీటర్లు కాగా లోతు ఐదు మీటర్లు, పొడవు 174 కి.మీ.లు ఉంది. ప్రస్తుతం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యం 17,633 క్యూసెక్కులు. గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించడంలో భాగంగా పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని మరో 23,144 క్యూసెక్కులు పెంచాలని నిర్ణయించారు. అంటే కాలువ ప్రవాహ సామర్థ్యం 40,777 క్యూసెక్కులకు పెరుగుతుంది. అయితే కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే వెడల్పు చేయడం ఒక్కటే మార్గం. లోతు పెంచేందుకు ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో కాలువ వెడల్పు అదనంగా 67 మీటర్లు (ఇరువైపులా 33.50 మీటర్ల చొప్పున) పెంచాలని నిర్ణయించారు. ఇందుకు సుమారు 776 ఎకరాలకుపైగా భూమి సేకరించాల్సి ఉంటుందని లెక్క కడుతున్నారు. భూ సేకరణకు రూ.350 కోట్లు ఖర్చవుతుందని, తక్కువ వ్యయంతో కాలువను వెడల్పు చేయడం ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించవచ్చనే అంచనాకు వచ్చారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లికి.. ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం సమీపంలో రెండు టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువ 80 కి.మీ (నకరికల్లు) వద్దకు ఎత్తిపోస్తారు. సాగర్ కుడి కాలువకు నీటిని అందిస్తూనే కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌కు జలాలను తరలిస్తారు. మున్నేరు, కట్టలేరు తదితర స్థానిక వాగులు వంకల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వరద వస్తే.. బ్యారేజీలోకి చేరే మొత్తం గోదావరి జలాలను సాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసేలా ఒకేసారి గరిష్ట సామర్థ్యంతో హరిశ్చంద్రాపురం వద్ద ఎత్తిపోతలను నిర్మించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. బొల్లాపల్లి రిజర్వాయర్‌ను 200 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేలా వ్యాప్కోస్ నివేదిక రూపొందించింది. కొండల మధ్య నిర్మించే ప్రతిపాదన కొండల దిగువన బొల్లాపల్లి రిజర్వాయర్ మట్టికట్ట నిర్మించాలని వ్యాప్కోస్ ప్రతిపాదించింది. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టాన్ని 202 మీటర్లుగా నిర్ణయించింది. అయితే దీనివల్ల 23 గ్రామాలు ముంపునకు గురవుతున్నందున సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండల దిగువన కాకుండా కొండల మధ్యన బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తే గరిష్ట నీటి మట్టాన్ని 209 మీటర్లకు పెంచుకోవచ్చని, 17 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం తగ్గుతుందని ప్రతిపాదిస్తున్నారు. పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాల తరలింపుపై డీపీఆర్, ఎస్టిమేట్లు(అంచనా) యుద్ధప్రాతిపదికన రూపొందించడంపై అధికారులు దృష్టి సారించారు. బొల్లాపల్లి – బనకచర్ల లైడార్ సర్వే బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్)లోకి గోదావరి జలాలను తరలింపు మార్గంపై గూగుల్ చిత్రాల ఆధారంగా వ్యాప్కోస్ ఫీజుబులిటీ నివేదిక రూపొందించింది. అయితే తాజాగా లైడార్ (ఏరియల్ వ్యూ ఆధారిత) సర్వేతో అలైన్మెంట్ రూపొందించాలని జలవనరులశాఖ అధికారులు వ్యాప్కోస్ను ఆదేశించారు. సొరంగం పొడవు తగ్గించడం, పులుల అభయారణ్యం, రిజర్వు ఫారెస్టులను తప్పిస్తూ తక్కువ ఖర్చుతో బనకచర్ల వరకు నీటి తరలింపు అలైన్మెంట్ రూపొందించాలని సూచించారు. బొల్లాపల్లి నుంచి గోదావరి జలాలను వెలిగొండ ప్రాజెక్టు కాలువకు సమాంతరంగా మరో కాలువ ద్వారా నల్లమల మైదాన ప్రాంతం ద్వారా తరలిస్తే టన్నెల్ తవ్వాల్సిన దూరాన్ని 40 కి.మీ.ల నుంచి 20 కి.మీ.లకు తగ్గించవచ్చు. దీనిపై వ్యాప్కోస్ అధ్యయనం చేసి వ్యయాన్ని లెక్కించనుంది. జనవరిలోగా తుది నివేదిక సిద్ధం కానుంది. వ్యాప్కోస్ నివేదిక అందగానే పోలవరం నుంచి బనకచర్లకు గోదావరి జలాల తరలింపు మార్గంపై ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగా పనులు ప్రారంభిస్తామని జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి. -
3,560 కోట్లతో ‘సీతారామ’ రెండోదశ
వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా 4 ప్యాకేజీల అంచనాలు సిద్ధం ఫిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులకు రూ.3,560 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ మొత్తాన్ని 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. ఫిబ్రవరి రెండో వారానికి టెండర్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. నిజానికి ఖమ్మం జిల్లాలో 5 లక్షలకు ఎకరాలకు నీరిచ్చేందుకు రూ.7,926 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో తొలి దశలో దుమ్ముగూడెం నుంచి 39వ కిలో మీటర్ కెనాల్ వరకు సీతారామ ప్రాజెక్టు పనులను 3 ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. మొదటి కిలోమీటర్ ప్రాంతం ఉన్న అమ్మవారిపల్లి నుంచి బీజీ కొత్తూరు వరకు ఉన్న 10.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్‌కు మొదటి ప్యాకేజీని రూ.1,455 కోట్లు, బీజీ కొత్తూర్ నుంచి వేపలగడ్డ(32వ కిలోమీటర్) వరకు రెండో ప్యాకేజీని రూ.317 కోట్లు, వేపులగడ్డ నుంచి కోయగుట్ట వరకు(39.9వ కిలోమీటర్) వరకు రూ.254 కోట్లతో టెండర్లు పిలిచి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ప్యాకేజీ–2, 3 పనులను ఏజెన్సీలు ఆరంభించగా, మొదటి విడత పనులు మొదలవ్వాల్సి ఉంది. ఈ సమయంలోనే 39.9వ కిలోమీటర్ నుంచి 114.5 కిలోమీటర్ వరకు ప్రస్తుతం సర్వే సంస్థ వ్యాప్కోస్ ఇచ్చిన నిఏదిక ఆధారంగా అంచనాలు సిధ్దమయ్యాయి. ఇందులో ప్యాకేజీల–4, 6లోని కోయగుట్ట, కమలాపురం పంప్‌హౌజ్‌ల అంచనాలు పూర్తి స్థాయిలో సిధ్దమవ్వాల్సి ఉండగా, మిగతా ప్యాకేజీలు 5,7,8,9ల అంచనాలు పూర్తయ్యాయి. ఇందులో ప్యాకేజీ–5 రూ.418కోట్లు, ప్యాకేజీ–7 (59.07వ కి.మీ నుంచి 83 కి.మీ వరకు)రూ.382.74కోట్లు, ప్యాకేజీ–8(83 కి.మీ. నుంచి 110కి.మీ.వరకు) రూ.537.41, ప్యాకేజీ–9 (110.42 నుంచి114.5 కి.మీ వరకు) రూ.176.59 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ప్యాకేజీ–9లో 110.4వ కిలోమీటర్ నుంచి 112.42 కిలోమీటర్ వరకు రెండు కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ఈ నాలుగు ప్యాకేజీలకు పంప్‌హౌస్ కింద వేసిన ప్రాధమిక అంచనా కలిపితే మొత్తంగా రెండోదశ రూ.3,560 కోట్లు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఆ పంప్‌హౌస్‌ల వ్యయం కచ్చితంగా తెలిసిన వెంటనే వచ్చే పిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచేలా అధికారుల కసరత్తు జరుగుతోంది.