భూగర్భజలాలపై జూన్‌లో అధ్యయనం
జిల్లా పరిధిలో భూగర్భ జలమట్టం నానాటికీ గణనీయంగా పడిపోతోంది. పొడి ప్రాంతాల్లో ఏడాదికి మీటరున్నర మేర తగ్గిపోతోంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
గుర్గావ్: గుర్గావ్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోని హైడ్రాలజీ విభాగం జూన్ మొదటివారంలో భూగర్భ జలాలపై అధ్యయనం చేపట్టనుంది. ఇందులోభాగంగా ఇప్పటికే 70 ప్రదేశాలను గుర్తించింది. జిల్లా యంత్రాంగం ప్రతి ఏడాది రెండు పర్యాయాలు భూగర్భ జలాలపై అధ్యయనం చేస్తున్న సంగతి విదితమే. వర్షాకాలానికి ముందు ఒకసారి, వర్షాకాలం తర్వాత ఒక సారి అధ్యయనం చేస్తోంది. వార్షిక భూగర్భ జలస్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారి ఎం.ఎస్. లాంబా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌లో ఓ పర్యాయం భూగర్భ జలాలపై అధ్యయనం చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోసారి అధ్యయనం చేయనున్నామన్నారు. గుర్గావ్ జిల్లా అర్ధ శుష్క ప్రాంత పరిధిలో ఉందన్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. బాగా పొడిగా ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం అత్యంత దారుణంగా తగ్గిపోతోందని, మీటరున్నర లోతుమేర తగ్గిపోతోందని అన్నారు.
ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమన్నారు. కాగా గుర్గావ్ జిల్లా పరిసరాల్లో భూగర్భజలాలు విపరీతంగా దోపిడీకి గురవుతున్నాయంటూ ఇటీవల కేంద్ర భూగర్భ జలబోర్డు (సీజీడబ్ల్యూజీ) పేర్కొన్న సంగతి విదితమే. అందువల్ల భూగర్భ జలమట్టం పుంజుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి విదితమే. మరోవైపు 2012లో స్థానిక న్యాయస్థానం కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది. వాణిజ్య అవసరాల కోసం భూగర్భజలాల వెలికితీత, వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. ఒకసారి భూగర్భగలాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పుంజుకునేందుకు సంవత్సరాల కొద్దీ సమయం పడుతుంది. ఒక్కోసారి ద శాబ్దాలు కూడా పట్టొచ్చు. అయితే గుర్గావ్‌లో తగ్గినప్పటికీ మరలా పుంజుకోవడం నగరవాసులకు బాగా ఊరట కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు.
పరిష్కరించేందుకు యత్నించాం
ఈ విషయమై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ భూగర్భజలాల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్నారు. వాననీటి సంరక్షణను ఇక్కడ తప్పనిసరి చేశామన్నారు. దీంతో పరిస్థితిలో గ ణనీయమైన మార్పు కనిపించిందన్నారు. ఇదిలాఉంచితే ఎన్సీఆర్ చానల్‌ద్వారా కూడా నీటిని నగరానికి రప్పిస్తున్నామన్నారు. దీంతో అవసరాలు కూడా తీరుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భూగర్భజలాల వాడకం తగ్గుముఖం పట్టిందని ఆయన వివరించారు.