జీవనదులు విలవిల | An expert says water scarcity is an emergency | Sakshi
Sakshi News home page

జీవనదులు విలవిల

Published Sun, Sep 4 2022 6:31 AM | Last Updated on Sun, Sep 4 2022 8:04 AM

An expert says water scarcity is an emergency - Sakshi

అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది.

230 కోట్ల మందికి నీటి కొరత
జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్‌ డ్రాట్‌ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది.

బయట పడుతున్న చారిత్రక అవశేషాలు
మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్‌ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌లోనే కాసెరస్‌ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్‌ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి.

నదులన్నింటా కన్నీళ్లే...
► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది.
► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది.
► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు.
► ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.
► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు.
► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయెర్‌ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు.
► యూరప్‌లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్‌ కూడా చిక్కిపోతోంది.
► అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి!
► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది.
► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్‌ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement