ఎండ 47 డిగ్రీలకు.. నీరు పాతాళానికి..
- రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగానే ఉన్న ఉష్ణోగ్రత
- చాలా చోట్ల తీవ్రమైన నీటి ఎద్దడి.. ట్యాంకరలతో సరఫరా
- మరఠ్వాడాలో కరవు పరిస్థితితో అడుగంటిన జలాలు
- మధ్యాహ్న సమయంలో కర్ఫ్యూ తలపిస్తున్న రహదారులు
- వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత తీవ్రం
సాక్షి, ముంబై: ఒక వైపు భానుడి ఉగ్రరూపం, మరోవైపు నీటి ఎద్దడి రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఉష్టోగ్రతలు 47 డిగ్రీలను దాటి అర్ధ సెంచరీ సాధించేందుకు సిద్ధంగా ఉండగా.. నీటి వనరులు పాతాల అంచుకు చేరిపోయి నోటి తడి ఆర్పేస్తున్నాయి.
ఎన్నడూ లేని విధంగా మరాఠ్వాడా తీవ్ర తాగు నీటి సమస్యను ఎదుర్కొంటుంది. అధిక సంఖ్యలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగు నీరు మరాఠ్వాడాకు సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం స్థానిక డ్యాములు సామార్థ్యం కంటే 8 శాతం తక్కువ నీటి నిలువలు పడిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఈ రీజియన్ పరిధిలో ఎనిమిది జిల్లాల్లోని దాదాపు 1,065 గ్రామాలకు, 377 కుగ్రామాలకు 1,500 ట్యాంకర్ల ద్వారా రోజూ నీటి సరఫరా జరుగుతోంది. గతేడాది 150 ట్యాంకర్ల ద్వారా మాత్రమే జరిగిన నీటి సరఫరా ఈ సారి అందుకు పది రెట్లు ఎక్కువగా జరుగుతోంది. ఈ పరిస్థితి నీటి సంక్షోభం ఎంత తీవ్రంగా చెప్పక నే చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,215 ట్యాంకర్ల ద్వారా 1,625 గ్రామాలు, 2,096 కుగ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 300 తాగునీటి ట్యాంకర్లను వినియోగించారు.
నీటి ఎద్దడి అధికంగా ఉంది: మంత్రి గిరీశ్
నీటి వనరుల విభాగ మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి అధికంగా ఉందని అన్నారు. ప్రధానంగా మరాఠ్వాడా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పారు. వచ్చే ఏడాది నాటిక ఈ విషయంపై జాగ్రత్త వహించి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత తాగు నీటి కొరత కొంత మేర తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాగ్‌పూర్‌లో అంతంత మాత్రమే
నాగ్‌పూర్ రిజీయన్‌పై నీటి సంక్షోభం ప్రభావం అంతగా చూపలేదని నీటి వనరుల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. కాని ఉష్ణోగ్రతలు మాత్రం 47 డిగ్రీలకు పైగానే ఉన్నాయని అన్నారు. కేవలం ఐదు ట్యాంకర్ల ద్వారానే నాగ్‌పూర్‌కు తాగు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వర్దా, గోండియా, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ఇప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేదని వివరించారు. కాగా, ఔరంగాబాద్, జాల్నా, బీడ్, పర్భణి, హింగోళి, నాందేడ్, ఉస్మానాబాద్, లాతూర్‌లకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఔరంగాబాద్‌లో అధికం గా 431 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బీడ్‌కు 361, జాల్నాకు 219 ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. కొంకణ్ రీజియన్‌కు 90 ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. నాసిక్‌కు 400 ట్యాంకర్లు, పుణే రీజియన్‌కు 70, అమరావతి రీజియన్‌కు వంద మంచి నీటి ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. మొదట ప్రైవేట్ నీటి ట్యాంకర్లను అద్దెకు తీసుకునే వాళ్లమని, అదనంగా అవసరం ఏర్పడటంతో ప్రభుత్వ ట్యాంకర్లను ఉపయోగించా ల్సి వస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. తాగు నీటి ట్యాంకర్లను పెంచాలన్న డిమాండు రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఒకవేళ ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైనా.. వర్షపాతం తగ్గినా రాష్ట్రం తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. రాష్ర్టంలోని చాలా ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నా సమస్యను పరిష్కరించేందుకు ఎవ్వరూ కృషి చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.
మండుతున్న ఎండలు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మరాఠ్వాడా పరి స్థితి తీవ్రంగా మారింది. విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోనూ ఎండలు ఠారెత్తుస్తున్నాయి. ఓ వైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు మండుతున్న ఎండలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరవుతో అల్లాడుతున్న అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి దర్శనమిస్తోంది. మరాఠ్వాడా ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర కరవు పరిస్థితి నెలకొని దుర్భిక్ష పరిస్థితులను సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కోంకణ్, ఉత్తర మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విదర్భలోని అకోలాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. వర్ధా, చంద్రాపూర్, అమరావతితోపాటు జల్‌గావ్, మాలేగావ్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక విదర్భ, మరాఠ్వాడాల్లో 42 నుంచి 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట ప్రజలు బయటికి రావాడానికే జంకుతున్నారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితిలోనే వెళ్తున్నారు. విదర్భలలోని అనేక పట్టణాల్లో మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తూ కర్ఫ్యూ తలపిస్తున్నాయి.