♦ ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ
♦ సమావేశం నుంచి బాయ్‌కాట్
♦ అధికారుల గైర్హాజర్‌పై మంత్రి కూడా మండిపాటు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టౌన్ : ఒక పక్కన కరువు విలయతాండవం చేస్తోంది. డిసెంబర్ నెల నుంచే పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. రైతు చక్రబంధంలో చిక్కుకున్నాడు. వేసిన పంటలు చేతికి రాక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంతటి కీలక సమయంలో జరిగిన జెడ్పీ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయకుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్ హాజరు కాలేదు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం తరఫున కూడా ఇన్‌ఛార్జి అధికారులే సమావేశానికి హాజరయ్యారు.దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించారు.
బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, కొండపి శాసనసభ్యుడు డోలా వీరాంజనేయస్వామి కూడా అధికారులు హాజరుకాకపోవడంపై ప్రశ్నించారు. అనంతరం సమావేశానికి వచ్చిన మంత్రి శిద్దా రాఘవరావు కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో 56 మండలాలలకుగాను 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కరువుపై, తాగునీరు, రైతులకు గిట్టుబాటు ధరలు, కరువు బృందం పర్యటన మొక్కుబడిగా సాగడం వంటి అంశాలపై శుక్రవారం ఎంపీ సుబ్బారెడ్డి ఇంట్లో సమావేశమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, పశుగ్రాసం దొరకడం లేదు. వీటిపై నిలదీయాలని నిర్ణయించారు.
కరువు నివేదికలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల జిల్లాకు వచ్చిన కరువు బృందం ఒక్కరోజులోనే తన పర్యటన ముగించుకుని వెళ్లిపోయింది. జిల్లాలో కరువు ప్రభుత్వ నివేదికలకంటే చాలా తీవ్రంగా ఉందని కరువు బృందం సభ్యులు వ్యాఖ్యానించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఈ అంశాలపై సమావేశంలో నిలదీయాలని సభ్యులు నిర్ణయించారు. సుబాబుల్, జామాయిల్ పంటలకు గిట్టుబాటు ధర విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. జెడ్పీ సమావేశానికి ఒక రోజు ముందు హడావిడిగా మీటింగ్ పెట్టి ప్రభుత్వం కొత్త ధరలు నిర్ణయించినా ఒక్క టన్ను కూడా పేపర్ మిల్లులు కొనుగోలు చేయలేదు.
కరువు కారణంగా పంటలు పండలేదు. పండిన వాటికి గిట్టుబాటు ధరలేదు. పొగాకు రైతులు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పటి వరకూ కేవలం లక్షా 10 వేల కిలోలు మాత్రమే పొగాకు అమ్ముడుపోయింది. ఏ డెల్టా కింద ఏ పంట నష్టపోయిందన్న అంచనాలు కూడా అధికారుల వద్ద లేకపోవడంతో కరువు బృందం పర్యటన కూడా పూర్తిగా జరగలేదు. ఈ అంశాలపై సమావేశంలో చర్చించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
అయితే కోర్టు వివాదం నేపథ్యంలో జిల్లాలోనే ఉన్న కలెక్టర్, జెడ్పీ సీఈవో సమావేశానికి రాకుండా ఉండిపోయారు. కీలకమైన అధికారులు లేనప్పుడు సమస్యలు ఎవరికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో తాము సమావేశాన్ని బాయ్‌కాట్ చేసినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 90 రోజులకోసారి జెడ్పీ సమావేశం జరపాలన్న సాంకేతిక అంశంతోనే ఈ సమావేశాన్ని పూర్తి చేయడం వివాదాస్పదం అయ్యింది.
జిల్లా కలెక్టర్ ఎందుకు రాలేదు
జిల్లాలో కరువుపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఇంతటి కీలకమైన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎందుకు రాలేదని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు సమావేశంలో అధికారులను నిలదీశారు. సమావేశానికి సంబంధించిన ఆహ్వానం ఎవరి పేరున పంపారు, అధికారికంగా ఆహ్వానం పంపిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎక్కడ, జెడ్పీ సీఈఓ ఎక్కడ అని ప్రశ్నించారు. కీలకమైన ఆ ఇద్దరు అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడం వల్ల ఉపయోగం ఏమిటి? చివరకు డిప్యూటీ సీఈఓ కూడా ఇన్‌ఛార్జి అనే విషయాన్ని గుర్తు చేశారు. - పాలపర్తి డేవిడ్‌రాజు
కలెక్టర్ కోసం పదినిమిషాలు ఎలా ఆపారు
గతంలో జరిగిన జిల్లాపరిషత్ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాలేదని పది నిమిషాలు ఎలా ఆపారని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. కలెక్టర్ లేకుండా హడావుడిగా సమావేశాలు పెట్టడం ఎందుకు అని నిలదీశారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు ఇలాంటి సమావేశాలు ఎన్ని నిర్వహించినా ఉపయోగం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. - గొట్టిపాటి రవికుమార్
వారు రాకపోవడం లోపమే
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశానికి బాధ్యతాయుతమైన కలెక్టర్, జెడ్పీ సీఈఓలు రాకపోవడం లోపమేనని కొండపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. సర్వసభ్య సమావేశంలో చేసే తీర్మానాలను అధికారులు పాటించాల్సి ఉంటుందన్నారు.
- బాలవీరాంజనేయస్వామి
తొందరపాటు నిర్ణయం కాదు
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం 90 రోజుల్లోపు జరగాల్సి ఉండటంతో ఏర్పాటు చేసినట్లు జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ చెప్పారు. ఇది తొందరపాటు నిర్ణయం కాదన్నారు. ప్రస్తుత సమావేశానికి కలెక్టర్ హాజరుకాకపోయినా మరో 15-30 రోజుల్లో ఇంకో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకోవచ్చని వివరణ ఇచ్చారు. - నూకసాని బాలాజీ
జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు తీర్మానం
అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం తరువాత స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లాను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. యుద్ధప్రాతిపదికన జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని మరో తీర్మానం చేసింది.
మార్చుకోకుంటే చర్యలు తప్పవు
‘జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశానికి సంబంధించి అధికారులందరికీ ముందుగానే సమాచారం అందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు. కొంతమంది అధికారులు రాలేదు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెబుతారు. మీ ఇష్టప్రకారం ప్రవర్తిస్తే పద్ధతిగా ఉండదు. అధికారులు తీరుమార్చుకోకుంటే చర్యలు తప్పవు.
- మంత్రి శిద్దా
సమావేషాలా?
Published Sun, Apr 5 2015 4:49 AM | Last Updated on Thu, Aug 9 2018 4:30 PM
Advertisement
Advertisement