తాగునీటికీ అధికార రంగు | water frobloms in produtur | Sakshi
Sakshi News home page

తాగునీటికీ అధికార రంగు

Published Sun, Feb 26 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

తాగునీటికీ అధికార రంగు

తాగునీటికీ అధికార రంగు

ప్రొద్దుటూరులో తీవ్ర నీటి ఎద్దడి
ప్రజల తరఫున ఎమ్మెల్యే పోరుబాట
సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు
క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునే పన్నాగంలో టీడీపీ నేతలు


తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు... ప్రొద్దుటూరులో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది... ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజల తరఫున పోరుబాట పట్టారు... ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు... ఇందుకు స్పందించిన కలెక్టర్‌ శుక్రవారం ప్రొద్దుటూరు వచ్చి పరిశీస్తానని చెప్పారు... సమస్య పరిష్కారమైతే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించారు... ఇందులో భాగంగానే కలెక్టర్‌ ప్రొద్దుటూరు రాకుండా వారు కుయుక్తులు పన్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు... అంతేకాకుండా సమస్య పరిష్కారమైతే పేరు, ప్రతిష్టను అధికార పార్టీ ఖాతాలో వేసే దిశగా అడుగులు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వందేళ్ల చరిత్ర ఉంది. అయితేనేం ఇప్పుడు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉండగా సుమారు 2 లక్షలకు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. వేసవి వచ్చిందంటే పట్టణ వాసులకు నీటి తిప్పలు తప్పడం లేదు. ఏటా పరిస్థితి ఇలాగే ఉండగా.. ఈ ఏడాది చలికాలంలోనే నీటి సమస్య తలెత్తింది. ఏటా వేసవిలో కలెక్టర్‌ అనుమతితో మైలవరం జలాశయం నుంచి నీరు కొద్దో గొప్పో తెచ్చుకొని  సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తున్నారు. శాశ్వతంగా నీరు విడుదల చేసేందుకు జీఓ లేకపోవడంతో కలెక్టర్‌ దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ ఏడాది సమస్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో మైలవరం నుంచి నీరు విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. కారణం అధికారులు కొత్త మార్గం నుంచి నీరు తీసుకురావడమే. ఎక్కువ దూరం పెన్నానదిలో తీసుకురావడంతో మధ్యలోనే అధిక భాగం నీరు ఇంకిపోయాయి. మున్సిపాలిటీలో అవసరమైన నిధులు ఉన్నా సమస్య పరిష్కారంలో పాలక వర్గంతోపాటు అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సమస్యపై దృష్టి సారించిన ఎమ్మెల్యే
పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో నేతలపై ఒత్తిడి పెరిగింది. వార్డు కౌన్సిలర్ల నుంచి ఎమ్మెల్యే వరకూ అందరికీ సమస్యను ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో  స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముందుగా అధికారులు, పాలక వర్గం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈనెల 13న మున్సిపల్‌ కార్యాలయం వద్ద 24 గంటలపాటు జల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చారు. కేసులకు బెదరకుండా ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. చివరికి పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించారు. ఈ కేసులకు తాము భయపడబోమని, సమస్యను పరిష్కరించని పక్షంలో ప్రొద్దుటూరు నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర చేసి ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.

పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభిస్తానని ప్రకటించారు. నీటి సమస్యను పాలకపక్షంతోపాటు అధికారుల కళ్లకు కట్టినట్లు చెప్పాలనే ఆలోచనతో.. గత సోమవారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తీవ్రతను వారికి వివరించా,రు. వాస్తవానికి ఎమ్మెల్యే చాలా కాలం తర్వాత కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత జిల్లాలోని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన గురువారం కలెక్టర్‌ కె.వి.సత్యనారాయణను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. సమస్యను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తున్నట్లు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.

కలెక్టర్‌ పర్యటన వాయిదా వెనుక కారణాలేంటో...
కలెక్టర్‌ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తారని, ఆయన రాకతోనైనా నీటి సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాదరెడ్డితోపాటు పట్టణ ప్రజలు ఎంతగానో ఆశించారు. అయితే 24 గంటలు కాకముందే కలెక్టర్‌ పర్యటన వాయిదా పడింది. అదే సమయంలో మున్సిపల్‌ చైర్మన్‌ గురివిరెడ్డితోపాటు పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డి తదితరులు శుక్రవారం కడపలో కలెక్టర్‌ను కలిసి నీటి సమస్యపై విన్నవించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి త్వరలో ప్రొద్దుటూరుకు నీరు వస్తుందని తెలిపారు. అధికార పార్టీ నేతల ప్రభావంతోనే కలెక్టర్‌ పర్యటన వాయిదా పడిందని వైఎస్సార్‌సీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్‌ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తే ఎమ్మెల్యే రాచమల్లుకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించి, ఇలా చేశారని వారు ఆరోపిస్తున్నారు. వీరి వైఖరి వల్ల సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఇంత కాలం నీటి సమస్య గురించి పట్టించుకోకుండా.. తీరా కలెక్టర్‌ వస్తున్న నేపథ్యంలో ఇలా చేయడం ఏమిటిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement