
13న రాచమల్లు జలదీక్ష
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం వద్ద జలదీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. 13న ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంట వరకు 24 గంటలు ఆహారం తీసుకోకుండా జల దీక్షను చేపడుతున్నట్లు వివరించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వం జిల్లా అంతటికీ కరువు వచ్చినా ప్రొద్దుటూరుకు రాదనే నానుడి ప్రజల్లో ఉండేదన్నారు. అయితే ఇప్పుడు వారానికోమారు కూడా తాగునీరు అందడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
సమస్యను గుర్తించిన నాయకుడు వైఎస్
పదేళ్ల కిందటే ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో రూ.72.53 కోట్లతో కుందూ–పెన్నా కాలువ అనుసంధానం చేయడం కోసం పథకాన్ని మంజూరు చేశారన్నారు. దీనిద్వారా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చవచ్చని వైఎస్ నిధులు మంజూరు చేస్తే ఆ నాడు ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజులరెడ్డి తన స్వార్థంతో సొంత ప్రయోజనాల కోసం టీడీపీ నేతల భూములను తక్కువ ధరకు సేకరించే ప్రయత్నం చేశాడని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రోజూ 150 క్యూసెక్కుల నీరు తెచ్చుకునే వీలు ఉండగా మున్సిపల్ అధికారులు అంతనీటిని వద్దంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కావాలంటే 5వేల నుంచి 10వేల క్యూసెక్కుల నీరు అవసరమని అన్నారు.