సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం.. అక్కడి ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీటి కొరత తీరనుండటంతో ఇప్పుడు ప్రభుత్వం దక్షిణ తెలంగాణ జిల్లాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా వలసలతో వెనుకబడ్డ పూర్వ పాలమూరు జిల్లా రూపురేఖలను మార్చేలా సాగునీటి వ్యవస్థను మెరుగులు దిద్దే పనిలో పడింది. ఈ జిల్లాలోనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించడంతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈపనుల ద్వారా మొత్తంగా జిల్లాలో 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని ప్రభుత్వం లక్ష్యాలు పెట్టుకుంది.
వంద శాతం పూర్తి
పూర్వ పాలమూరు జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టుల కింద కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను చేపట్టారు. వీటికింద 8.78 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 6.03లక్షల ఎకరాల మేర ఆయకట్టు అందుబాటు లోకి వచ్చింది. కల్వకుర్తి కింద గరిష్టంగా 2.59లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించ గలిగారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నీరోస్తే ఈ ఒక్క ప్రాజెక్టు కిందే 3.25లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు నెట్టెంపాడు కింద 1.42లక్షలు, భీమా కింద 1.70లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది.
చెల్లింపులు లేక నిలిచిన పనులు
గత తొమ్మిది నెలలుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు వెనుకబడ్డాయి. చాలాచోట్ల భూసేకరణ నిలిచిపోయింది. కల్వకుర్తి పరిధిలో రూ.60కోట్లు, నెట్టెంపాడులో రూ.15కోట్లు, భీమాలో రూ.10 కోట్ల మేర పెండింగ్ బిల్లులతో పనులు కదల్లేదు. భూసేకరణకు సైతం ఈ ప్రాజెక్టులకు రూ.20కోట్ల మేర తక్షణం చెల్లించాల్సి ఉన్నా అది జరగకపోవడంతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలు లేవు.
దీనిపై ఇటీవల 15 రోజుల వ్యవధిలోనే రెండుమార్లు సమీక్షించిన కేసీఆర్ ఈ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి 8.78 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడం కష్టమేం కాదు. కేవలం రూ.150 కోట్లను తక్షణం విడుదల చేసినా ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. జూరాల కింద ఇప్పటికే లక్ష ఎకరాలు సాగవుతోంది. దీంతో పాటే ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు, తుమ్మిళ్ల కింద 31,500 ఎకరాలు, గట్టు ఎత్తిపోతల ద్వారా 33 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 11 లక్షల ఎకరాలను వచ్చే ఏడాది సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు మార్గదర్శనం చేశారు.
బడ్జెట్ సమావేశాల తర్వాతే ‘గట్టు’పనులు
బడ్జెట్ సమావేశాల అనంతరం గట్టు ఎత్తిపోతల పనులు మొదలు పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 12.30లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాల్సి ఉండగా, ఇందులో పూర్వ పాలమూరు జిల్లాలోని 7లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులను వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికే పూర్తి చేసేలా శుక్రవారం రాత్రి జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశాలిచ్చారు. దీనికోసం నిధుల ఖర్చు ఎలా ఉండాలి, రూ.10వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించాలన్న దానిపై ఇంజనీర్లకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment