
భూగర్భ ‘శోకం’
అథఃపాతాళంలో గంగ
10 మీటర్ల లోతులో నీటిమట్టం
గతంతో పోలిస్తే నాలుగు మీటర్లు ఎక్కువ
వేసవిలో తాగునీటికి తిప్పలే..
డిసెంబర్ 19న జెడ్పీ సమావేశంలో పది రోజుల వ్యవధిలో వేసవిలో నీటి ఎద్దడి పై ప్రణాళిక, కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు సిద్ధం కాలేదు.
భూ ఉపరితలం నుంచి ఎనిమిది మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోతే కరువు ఛాయలు అలుముకున్నట్లుగా అధికారులు పరిగణిస్తారు. జిల్లాలో 50 మండలాలు ఉండగా వీటిలో 32 మండలాల్లో నీటిమట్టం ఎనిమిది మీటర్లు కంటే కిందికి చేరుకుంది. కాగా, రఘునాథ్‌పల్లి, ములుగు మండలాల్లో అత్యంత లోతులో 25.28 మీటర్ల లోతులో భూగర్భనీరు ఉంది. భూగర్భ జలవనరుల విభాగం తాజా నివేదిక ప్రకారం 2014 డిసెంబరు నాటికే జిల్లా సగటు భూగర్భనీటి మట్టం 9.66 మీటర్లకు పడిపోయింది.
హన్మకొండ : జిల్లాలో భూగర్భ జలమట్టాలు రోజురోజుకి పడిపోతున్నారుు. వేసవికి ముందే 32 మండలాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థారుుకి చేరుకుంది. జిల్లా యంత్రాంగం దృష్టిసారించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే వేసవిలో జిల్లావాసులు మంచినీటికి కటకటలాడాల్సిదే. జిల్లా సగటు వర్షపాతంతో పోల్చితే 32 శాతం తక్కువగా నమోదైంది. దీంతో చెరువులు, కుంటల్లో జలవనరుల నిల్వ తగ్గింది. దీనికితోడు వర్షాభావంతో వ్యవసాయదారులు ఖరీఫ్, రబీ సీజన్లలో బోరుబావులపై అధికంగా ఆధారపడ్డారు. ఫలితంగా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. శీతాకాలం ముగియకముందే భూగర్భ నీటిమట్టం దాదాపు పదిమీటర్ల కిందికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
అంతటా ఇదేతీరు..
కరువు, అటవీ ప్రాంతం అని తేడా లేకుండా జిల్లా అంతట భూగర్భ జలాలు అడుగంటారుు. జిల్లాలో కరువు ప్రాంతంగా పేర్కొనే జనగామ సబ్‌డివిజన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ డివిజన్‌లో పది మండలాలు ఉండగా ఇక్కడ నీటిమట్టం లోతు జిల్లా సగటు కంటే ఎక్కువగా నమోదైంది. జనగామ సబ్‌డివిజన్ పరిధిలో ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం 14.65 మీటర్ల లోతులో ఉంది. ఇదే డివిజన్‌లోని రఘునాథ్‌పల్లి మండలంలో అత్యంత లోతులో 25.28 మీటర్ల లోతులో భూగర్భనీరు ఉంది. ములుగులో కూడా నీటిమట్టం పడిపోవడం ఈ ఏటి కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఏడాది వ్యవధిలో ములుగు డివిజన్ పరిధిలో సగటునీటి మట్టం పది మీటర్లు లోతుకు పోయింది. 2013 డిసెంబరులో ములుగు సబ్‌డివిజన్‌లో సగటు నీటిమట్టం 6.42 మీటర్లలోతులో ఉండగా 2014 నాటికి ఈ దూరం 9.62 మీటర్లకు పోయింది. ఈ డివిజన్‌లో ములుగు మండలంలో అత్యధికంగా 15.74 మీటర్ల లోతులో నీరు అందుబాటులో ఉంది.
అప్పుడే వేసవి ఛాయలు
సాధారణంగా డిసెంబరులో ఉన్న నీటిమట్టం మే నెల వచ్చే సరికి తగ్గుతుంది. 2013 డిసెంబరులో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 5.66 మీటర్ల లోతు ఉండగా 2014 మే నాటికి 8.68 మీటర్ల లోతుకు పడిపోయింది. కానీ ఈసారి వేసవి రాకముందే 2014 డిసెంబరు నాటికే జిల్లా సగటు భూగర్భ జలమట్టం 9.60 మీటర్లు చేరుకుంది. అంటే గత వేసవిలో నీటిమట్టం కంటే ఈ శీతాకాలంలోనే నీటిమట్టం ప్రమాదకరస్థాయిని దాటి ఒక మీటరు లోతుకు వెళ్లింది. వేసవిలో ఉండాల్సిన పరిస్థితి శీతాకాలంలో ఉండటాన్ని బట్టి.. ఇదేతీరుగా నీటిమట్టాలు పడిపోతూ ఉంటే వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
వేగంగా పడిపోతున్న నీటిమట్టాలు
వేసవి కాలం సమీపిస్తున్నకొద్దీ నీటిమట్టాల్లో తరుగుదల వేగంగా జరుగుతోంది. 2014 నవంబరు నుంచి డిసెంబరు వరకు నెలరోజుల వ్యవధిలోనే జిల్లా సగటు భూగర్భ జలమట్టం 0.70 మీటర్ల లోతుకు వెళ్లింది. రఘునాథ్‌పల్లి మండలంలో అత్యధికంగా 4.45 మీటర్ల లోతుకు నీటిమట్టం పడింది. ఇక్కడ 2014 నవంబరులో నీటిమట్టం 20.83 మీటర్లు ఉండగా డిసెంబరు నాటికి ఇది 25.28 మీటర్లకు చేరుకుంది. నెల రోజుల వ్యవధిలో ఒక మీటరు కంటే ఎక్కువగా నీటిమట్టం పడిన మండలాల్లో నర్మెట(1.23), స్టేషన్‌ఘన్‌పూర్(1.78), ధర్మసాగర్(1.71), హసన్‌పర్తి(1.29), దుగ్గొండి(1.67), ములుగు(2.62) ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒక చేర్యాల మండలంలోనే నీటిమట్టం స్థాయి పెరిగింది. తపాస్‌పల్లి రిజార్వాయర్ వల్ల ఇక్కడ నీటిమట్టాల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. డిసెంబరు 2013లో 18.52 మీటర్లలోతు నుంచి 2014 నాటికి 14.05 మీటర్లకు పెరిగింది.
అతీగతీలేని జెడ్పీ తీర్మానాలు
2014 డిసెంబరు 19వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో 10 రోజుల వ్యవధిలో వేసవిలో నీటి ఎద్దడి పై ప్రణాళిక, కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు కార్యాచరణ సిద్ధం కాలేదు. ప్రస్తుతం జిల్లాలో చేతిపంపులు 18,295, రక్షిత మంచినీటి సరఫరా పథకాలు 2,155 పని చేస్తున్నాయి. వీటికి అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 353 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 82 పనులు మొదలు పెట్టలేదు. మొదలైన పనుల్లో 129 పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం అంతా వాటర్ గ్రిడ్ జపం చేస్తూ రానున్న వేసవి తాగునీటి సమస్యలను ఎదుర్కొవడంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా అధికారులు ఇలాగే వ్యవహరిస్తే వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొవడం కష్టంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
260 ఫీట్ల లోతు వేసినా చుక్కనీరు లేదు..
గ్రామంలోని రెండు ఎస్సీ కాలనీల్లో తాటునీటి కోసం ఇబ్బందులున్నాయి. ఉన్న బోర్లలో భూగర్భజలం అడుగంటిపోయాయి. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు మూడు బోర్లు 260 ఫీట్ల లోతు వేయించాం. ఒక్కదాంట్లో చుక్కనీరు పడలేదు. కొత్తగా బోరు వేయాలంటేనే భయమేస్తోంది. వేసవి ముంచుకు వస్తుండడంతో ఎస్సీకాలనీలో నెలకొన్న నీటి ఎద్దడిని ఎలా నివారించాలో తెలియని పరిస్థితి.
- కంసాని మమత మహేందర్‌రెడ్డి,
సర్పంచ్, పోచ్చన్నపేట, బచ్చన్నపేట
ఆందోళనకరం..
ఈసారి తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం తగ్గింది. ఎనిమిది మీటర్లు లోతుకంటే నీటిమట్టం పడిపోతే తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిసెంబరు నాటికే జిల్లా సగటు నీటిమట్టం 9.66 మీటర్లుకు చేరుకోవడం ఆందోళనకరం.
- ఆనంద్, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ