'టాయిలెట్లను మందిరాలుగా మారుస్తున్నారు'
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాల్లో టాయిలెట్లను ప్రార్ధనామందిరాలుగా, గోడౌన్లుగా మార్చారని కేంద్ర గ్రామీణశాఖ నితిన్ గడ్కరీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా టాయిలెట్లను వినియోగించలేకపోతున్నారని గడ్కరీ తెలిపారు. తాగునీరు, సానిటేషన్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాత్మగాంధీ 150 జన్మదినోత్సవం నాటికి అంటే 2019 క్లీన్ ఇండియా అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కేవలం టాయిలెట్లను నిర్మిస్తే సరిపోదని ఆయన అన్నారు. దేశంలో మూడు లక్షల టాయిలెట్లను నిర్మిస్తే అందులో కేవలం 10 వేల సంఖ్యలో మాత్రమే ప్రజలు వినియోగిస్తున్నారన్నారు.
కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన టాయిలెట్లను మందిరాలుగా మలచడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అందుకే నీటి వసతులు లేకుండా టాయిలెట్లను ఉపయోగిస్తే నిరుపయోగమని, ప్రభుత్వం అనుకునే లక్ష్యం నెరవేరదని నితిన్ గడ్కరీ అన్నారు.