
వాయిదా
కోరం లేకపోవడంతోనే.. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటన
► జెడ్పీ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యుల గైర్హాజరు
► జెడ్పీ చైర్మన్ ప్రకటనపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్
► ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి మధ్య మాటల యుద్ధం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం, తాగునీటి ఎద్దడి, కరువు సాయంపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మూడు నెలలకోసారి జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడడంతో పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రారంభమే కాలేదు. సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తదితరులు సకాలంలోనే హాజరయ్యారు.
అయితే సమావేశం నిర్వహించడానికి అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల కోరం పూర్తికాకపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌తో కలిపి కేవలం 20 మంది మాత్రమే హాజరుపట్టికలో సంతకాలు చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు నిధులు-విధులు కేటాయించకుండా ప్రభుత్వం తమ పదవులను అలంకారప్రాయం చేస్తుందని, మండలాల్లో ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి నెలకొందంటూ పలువురు జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి హాజరుకావద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఎవరు సమావేశానికి హాజరుకాలేదు.
టీఆర్‌ఎస్‌నుంచి జెడ్పీటీసీలు పలువురు తొలుత సమావేశ మందిరానికి వచ్చారు. హాజరుపట్టికలో సంతకాలు చేసిన వారు కేవలం 20 మందే కావడంతో సమావేశం నిర్వహించడానికి అవసరమైన 1/3వ వంతు సభ్యుల హాజరు లేకపోవడంతో వాయిదా వేస్తున్నామని, జెడ్పీటీసీ సభ్యులకు వివాహ కార్యక్రమాలు, ఇతర అత్యవసర పనులుండడంతో హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటించారు.
అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్యే సంపత్
జెడ్పీచైర్మన్ సమావేశం వాయిదా ప్రకటన చేయకముందే సభా వేదికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ తదితరులు కూర్చున్నారు. సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే అలంపూర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్ లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, పశుగ్రాసం కొరతతో జిల్లా అల్లాడుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో కీలకమైన అంశాలను చర్చించి ప్రజలకు ఉపశమనం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశం నిర్వహణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, పెళ్లిళ్ల సాకుతో వాయిదా ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని తమ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు సమావేశానికి వచ్చారని, మీ పార్టీకి చెందిన సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకుండా ఈ తరహా బేకార్ మాటలు మాట్లాడడం తగదని వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ సభ్యులు కొందరు మినహా మిగతా సభ్యులెవరూ అటువైపే రాకపోవడంతో సమావేశం వాయిదా వేయక తప్పలేదు.
మంత్రి నచ్చజెప్పి చూసినా...
నిధులు-విధులు, ఇతర సమస్యలకు సంబంధించి అన్ని పార్టీలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి ముందుగానే మంత్రి జూపల్లి కృష్ణారావును ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలిసి విన్నవించారు. అయితే సమావేశానికి హాజరై మీ అభిప్రాయాలను తీర్మానం రూపంలో ప్రభుత్వానికి పంపించవచ్చని, లేదా సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అనేక మంది జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో జెడ్పీ సమావేశం నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీకి సొంత పార్టీ సభ్యుల నుంచే కొంత సహకారం కొరవడడం చర్చనీయాంశంగా మారింది.
మంత్రుల ఇలాఖానుంచే గైర్హాజరు..
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు మాత్రమే హాజరుకావడం సమావేశ ప్రాంగణంలో చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఏ ఇద్దరు సభ్యులు హాజరైనా కోరం పూర్తయి సమావేశం సజావుగా సాగేదని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉండేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడడం గమనార్హం.