MLA Sampat
-
ఆర్డీఎస్కు రూ.10 లక్షలు మంజూరు
– మంత్రి హరిశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే సంపత్ అయిజ : ఆర్డీఎస్ గేటు నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కోరగా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో ఎమ్మెల్యే సంపత్ అయిజ, వడ్డెపల్లి రైతులతో వెళ్లి మంత్రిని కలిసి ఆర్డీఎస్ సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 16న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద సుంకేసుల రిజర్వాయర్ వైపు నీళ్లు వెళ్లే 2వ స్కవర్ స్లూయిస్ గేట్ విరిగిపోయిందని, నీళ్లు వథాగా పోతున్నాయని మంత్రికి తెలిపారు. దీంతో ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు రావని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రం ఆర్డీఎస్ సీఈ మల్లికార్జున్, ఎస్సీ, తెలంగాణ ఆర్డీఎస్ సీఈ ఖగేందర్తో మాట్లాడానని సంబంధిత ఇంజనీర్లు రూ. 10 లక్షలకు ఎస్టిమేషన్ చేశారని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి వెంటనే రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎమ్మెల్యేతోపాటు రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధం
♦ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ♦ ఆర్డీఎస్ సాధనకు ఎమ్మెల్యే సంపత్ మహాదీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎడారిగా మారుతున్న పాలమూరు జిల్లాను రక్షించుకోవడానికి సాగునీటిలో తెలంగాణ వాటా పొందేందుకు ఎవరితోనైనా యుద్ధం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం సింగనూరు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కాలువ వద్ద సోమవారం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చేపట్టిన ఒకరోజు మహా దీక్షలో ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలి ఫ్లోర్‌లీడర్ షబ్బీర్ అలీ, మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తమ రాజకీయ అవసరాల కోసం రాజోలిబండ వంటి సాగునీటి ప్రాజెక్టులను ముందుపెట్టి ప్రజల్లో ఆశలు రేపిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తరువాత దాని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. అయితే ఆ పేరుతో జరిగే అవినీతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలలో అవాస్తవిక రేట్లను టెండర్లలో కోట్ చేసి వేల కోట్ల రూపాయలను దిగమింగడానికి ప్రభుత్వం పక్కాప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల్లో ఆంధ్రులకు కాంట్రాక్టు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు కోసం కనీసం రెండు టీఎంసీలకు తగ్గకుండా విడుదల చేయాలని మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, ఇరిగేషన్ శాఖ మంత్రి పాటిల్‌ను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ పూర్తయ్యే వరకు పోరాటం ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తిచేసేంత వరకు ప్రజల పక్షాన పోరాడుతామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని ఆర్డీఎస్ను పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇటు రాకపోవడం ఆయనకు అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఆర్డీఎస్ పనులను కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి సత్వరమే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు పక్కనపెట్టి కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు మరో ఉద్యమం చేయాలని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనన్నారు. ప్రభుత్వం అలంపూర్ నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నా రు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ఈ ప్రాజెక్టు సాధనకు కాంగ్రెస్ పోరాడుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, బచావో తెలంగాణ మిషన్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆర్డీఎస్‌పై సీఎం కుర్చీ అలంపూర్: ఆర్డీఎస్ కెనాల్ వద్ద సీఎం కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కుర్చీ నిరసన ఆకట్టుకుంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకుని పనులు చేసి నీళ్లు పారిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని గుర్తు చేస్తూ ఈ కుర్చీ ఏర్పాటు చేశారు. -
వాయిదా
కోరం లేకపోవడంతోనే.. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటన ► జెడ్పీ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యుల గైర్హాజరు ► జెడ్పీ చైర్మన్ ప్రకటనపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ► ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి మధ్య మాటల యుద్ధం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం, తాగునీటి ఎద్దడి, కరువు సాయంపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మూడు నెలలకోసారి జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడడంతో పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రారంభమే కాలేదు. సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తదితరులు సకాలంలోనే హాజరయ్యారు. అయితే సమావేశం నిర్వహించడానికి అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల కోరం పూర్తికాకపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌తో కలిపి కేవలం 20 మంది మాత్రమే హాజరుపట్టికలో సంతకాలు చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు నిధులు-విధులు కేటాయించకుండా ప్రభుత్వం తమ పదవులను అలంకారప్రాయం చేస్తుందని, మండలాల్లో ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి నెలకొందంటూ పలువురు జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి హాజరుకావద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఎవరు సమావేశానికి హాజరుకాలేదు. టీఆర్ఎస్నుంచి జెడ్పీటీసీలు పలువురు తొలుత సమావేశ మందిరానికి వచ్చారు. హాజరుపట్టికలో సంతకాలు చేసిన వారు కేవలం 20 మందే కావడంతో సమావేశం నిర్వహించడానికి అవసరమైన 1/3వ వంతు సభ్యుల హాజరు లేకపోవడంతో వాయిదా వేస్తున్నామని, జెడ్పీటీసీ సభ్యులకు వివాహ కార్యక్రమాలు, ఇతర అత్యవసర పనులుండడంతో హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటించారు. అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్యే సంపత్ జెడ్పీచైర్మన్ సమావేశం వాయిదా ప్రకటన చేయకముందే సభా వేదికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ తదితరులు కూర్చున్నారు. సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే అలంపూర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్ లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, పశుగ్రాసం కొరతతో జిల్లా అల్లాడుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో కీలకమైన అంశాలను చర్చించి ప్రజలకు ఉపశమనం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశం నిర్వహణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, పెళ్లిళ్ల సాకుతో వాయిదా ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని తమ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు సమావేశానికి వచ్చారని, మీ పార్టీకి చెందిన సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకుండా ఈ తరహా బేకార్ మాటలు మాట్లాడడం తగదని వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సభ్యులు కొందరు మినహా మిగతా సభ్యులెవరూ అటువైపే రాకపోవడంతో సమావేశం వాయిదా వేయక తప్పలేదు. మంత్రి నచ్చజెప్పి చూసినా... నిధులు-విధులు, ఇతర సమస్యలకు సంబంధించి అన్ని పార్టీలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి ముందుగానే మంత్రి జూపల్లి కృష్ణారావును ఆర్అండ్బీ అతిథి గృహంలో కలిసి విన్నవించారు. అయితే సమావేశానికి హాజరై మీ అభిప్రాయాలను తీర్మానం రూపంలో ప్రభుత్వానికి పంపించవచ్చని, లేదా సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అనేక మంది జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో జెడ్పీ సమావేశం నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీకి సొంత పార్టీ సభ్యుల నుంచే కొంత సహకారం కొరవడడం చర్చనీయాంశంగా మారింది. మంత్రుల ఇలాఖానుంచే గైర్హాజరు.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు మాత్రమే హాజరుకావడం సమావేశ ప్రాంగణంలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్కు చెందిన ఏ ఇద్దరు సభ్యులు హాజరైనా కోరం పూర్తయి సమావేశం సజావుగా సాగేదని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉండేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడడం గమనార్హం. -
బయట పొగుడుతావ్.. లోపల విమర్శిస్తావ్!
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మధ్య కొద్దిసేపున ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ప్రశ్నోత్తరాల తర్వాత మీడియా పాయింట్‌కు వెళ్తున్న హరీశ్‌రావుకు లాబీలో సంపత్ ఎదురుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని సంపత్ అభినందించారు. దీంతో ‘బయటనేమో పొగుడుతవ్.. లోపల మాత్రం విమర్శిస్తవ్’ అంటూ మంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. ‘లేదన్నా! బడ్జెట్‌పై చర్చలో మిషన్ కాక తీయ, ప్రాజెక్టుల గురించి పాజిటివ్‌గా మాట్లాడిన, ఎవరినన్నా అడగండి’ అంటూ సంపత్ పేర్కొన్నారు. పక్కనే ఉన్న నిజామాబాద్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కల్పించుకుని ‘ఎక్కడ పొగిడారు’ అంటూ వ్యాఖ్యానించారు.