
ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధం
ఎడారిగా మారుతున్న పాలమూరు జిల్లాను రక్షించుకోవడానికి సాగునీటిలో తెలంగాణ వాటా పొందేందుకు ఎవరితోనైనా యుద్ధం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
♦ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
♦ ఆర్డీఎస్ సాధనకు ఎమ్మెల్యే సంపత్ మహాదీక్ష
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎడారిగా మారుతున్న పాలమూరు జిల్లాను రక్షించుకోవడానికి సాగునీటిలో తెలంగాణ వాటా పొందేందుకు ఎవరితోనైనా యుద్ధం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం సింగనూరు ఆర్‌డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కాలువ వద్ద సోమవారం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చేపట్టిన ఒకరోజు మహా దీక్షలో ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలి ఫ్లోర్‌లీడర్ షబ్బీర్ అలీ, మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తమ రాజకీయ అవసరాల కోసం రాజోలిబండ వంటి సాగునీటి ప్రాజెక్టులను ముందుపెట్టి ప్రజల్లో ఆశలు రేపిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తరువాత దాని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. అయితే ఆ పేరుతో జరిగే అవినీతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.
పాలమూరు ఎత్తిపోతలలో అవాస్తవిక రేట్లను టెండర్లలో కోట్ చేసి వేల కోట్ల రూపాయలను దిగమింగడానికి ప్రభుత్వం పక్కాప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల్లో ఆంధ్రులకు కాంట్రాక్టు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు కోసం కనీసం రెండు టీఎంసీలకు తగ్గకుండా విడుదల చేయాలని మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, ఇరిగేషన్ శాఖ మంత్రి పాటిల్‌ను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఆర్డీఎస్ పూర్తయ్యే వరకు పోరాటం
ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తిచేసేంత వరకు ప్రజల పక్షాన పోరాడుతామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని ఆర్డీఎస్‌ను పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇటు రాకపోవడం ఆయనకు అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఆర్డీఎస్ పనులను కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి సత్వరమే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.
సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు పక్కనపెట్టి కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు మరో ఉద్యమం చేయాలని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనన్నారు. ప్రభుత్వం అలంపూర్ నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నా రు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ఈ ప్రాజెక్టు సాధనకు కాంగ్రెస్ పోరాడుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, బచావో తెలంగాణ మిషన్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆర్డీఎస్‌పై సీఎం కుర్చీ
అలంపూర్: ఆర్డీఎస్ కెనాల్ వద్ద సీఎం కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కుర్చీ నిరసన ఆకట్టుకుంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకుని పనులు చేసి నీళ్లు పారిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని గుర్తు చేస్తూ ఈ కుర్చీ ఏర్పాటు చేశారు.