న్యూఢిల్లీ: దేశీయంగా 450 పైచిలుకు వెబ్3 స్టార్టప్‌లు గత రెండేళ్లలో 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,700 కోట్లు) సమీకరించాయి. వీటిలో 80 శాతం అంకుర సంస్థలు ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. అయితే, జైపూర్, వదోదర, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా క్రమంగా వెబ్3 స్టార్టప్స్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, వెంచర్ క్యాపిటల్ ఫండ్ హ్యాష్డ్ ఎమర్జెంట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
‘గత రెండేళ్లలో వెబ్3 స్టార్టప్‌ల సంఖ్య 450కి పైగా పెరిగింది. వీటిలో 4 యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) ఉన్నాయి. 2022 ఏప్రిల్ నాటికి ఇవి 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. 2021–22లో కొత్తగా 170 వెబ్3 స్టార్టప్‌లు నమోదయ్యాయి‘ అని నివేదిక పేర్కొంది. మెటావర్స్, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ) మొదలైన కొత్త సాంకేతిక కాన్సెప్టులతో వెబ్3 (మూడో తరం వరల్డ్ వైడ్ వెబ్) పదం మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా వెబ్3 నిపుణుల్లో 11 శాతం మంది భారత్‌లో ఉన్నారు. తద్వారా వెబ్3 నిపుణుల లభ్యతపరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే 1–2 ఏళ్లలో వీరి సంఖ్య 120 శాతం పైగా పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.
చదవండి: ఈ ఫోన్‌పై బోలెడు ఆఫర్లు, 90 శాతం వరకు తగ్గింపు కూడా!
Comments
Please login to add a commentAdd a comment