
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మే 15 వరకూ రాజకీయ పార్టీలు సమీకరించిన నిధుల మొత్తం, దాతల విరాళాలు, బ్యాంక్ ఖాతాల సమాచారం వంటి వివరాలను మే 31లోగా సీల్డ్ కవర్‌లో ఈసీకి సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల పధకం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించే విరాళాల్లో పారదర్శకత పాటించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ఏకీభవించింది. కాగా, రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు బాండ్లు మినహా పారదర్శక ప్రత్యామ్నాయాలు ఉండాలని, ఎలక్టోరల్ బాండ్లను అనుమతించడంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు.
మరోవైపు రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుచేసేవారి పేర్లను గోప్యంగా ఉంచితే ఎన్నికల్లో బ్లాక్‌మనీని నిరోధించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలు వృధా అవుతాయని గురువారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్ల పధకాన్ని సవాల్ చేస్తూ ఓ ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బహిర్గతం చేయాలని పిటిషనర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment