సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వంద శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం పట్ల కాంగ్రెస్ నేత, వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొత్తం వీవీప్యాట్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఎందుకు కోరుకోవడం లేదని ప్రశ్నించిన ఉదిత్ రాజ్ రిగ్గింగ్‌లో కోర్టు సైతం పాలుపంచుకుందా అంటూ నిలదీశారు.
మూడు నెలలుగా ఎన్నికల ప్రక్రియతో పాలన అటకెక్కగా, మరో రెండు మూడు రోజులు ఓట్ల లెక్కింపులో జాప్యాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారని సర్వోన్నత న్యాయస్ధానాన్ని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. లెక్కించే వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలని కోరుతూ 22 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే దీని వల్ల ఓట్ల లెక్కింపులో జాప్యం చోటుచేసుకుంటుందని న్యాయస్ధానం తిరస్కరించిందని ఆక్షేపించారు.
సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియతో అభివృద్ధి పనులు నిలిచిపోగా, మరో ఒకటి రెండు రోజులు సమయంపడితే ఏమవుతుందన్నారు. తాను సుప్రీం కోర్టుపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని, తన ఆందోళనను మాత్రమే వెలిబుచ్చుతున్నానని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉదిత్ రాజ్ కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment