భూమి లేదు.. భవనం లేదు!
♦ కళాశాల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు
♦ స్థలం కేటాయింపు లేక ఇప్పటికే రెండుసార్లు నిధులు వాపస్
♦ శివ్వంపేట జూనియర్ కాలేజీ విద్యార్థుల ఇబ్బందులు
శివ్వంపేట: ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అంటే ఇదే! శివ్వంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి నిధులు పుష్కలంగా ఉన్నా.. అవసరమైన స్థలం కేటాయింపు జరకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మం జూరైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో తాత్కాలికంగా కాలేజీ ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో చాలీచాలని గదుల్లో ఎంపీసీ, సీఈసీ గ్రూపులు ప్రారంభమయ్యాయి. కాగా, ఎనిమిదేళ్లుగా కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణం చేత గత ఏడాది రెండు గ్రూపులకు సంబంధించి 60 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా.. ఈసారి ప్రవేశాలు సగానికి పడిపోయాయి.
రూ.10 కోట్లు మంజూరు
కాలేజీ నిర్మాణానికి వారం రోజుల క్రితం రూ.10 కోట్ల మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ.8.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించాయి. దీంతో పాటు కరీంనగర్ జిల్లా గొల్లపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, ఆదిలాబాద్ జిల్లా దండెపల్లిలో కాలేజీ భవన నిర్మాణాలకు ఈసారి నిధులు మంజూరయ్యాయి. శివ్వంపేటలో భవన నిర్మాణానికి 2010లో రూ.75 లక్షలు మంజూరు కాగా స్థలం కేటాయించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 2012లో రూ.కోటి మంజూరు కాగా భూమి సమస్యే ఎదురైంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది.
ఈక్రమంలో అనువైన స్థలాన్ని కేటాయిస్తే అన్ని వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి కాలేజీ నిర్మాణం జరుగనుంది. ఇందులో పూర్తిస్థాయి ఫర్నిచర్, కంప్యూటర్, డిజిటల్ క్లాస్, ఆర్వోప్లాంట్, ల్యాబ్ ఏర్పాటుచేయనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి సంబంధించిన భూమిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మండల కేంద్రంలో తూప్రాన్-నర్సాపూర్ ప్రధా న రహదారి పరిసరాల్లో ప్రభుత్వ భూ ములు ఉన్న అన్యాక్రాంతం కావడంతో స్థలం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎమ్మెల్యేకు వినతి
కాలేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, భూమి కేటాయింపు చేపట్టాలని రెండు రోజుల క్రితం శివ్వంపేట పర్యటనకు వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యేకు కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు మెమెరాండం ఇచ్చారు.