‘ఉపాధి’ యాతన
నెలన్నరగా వేతనాల చెల్లింపులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం
⇒ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.310.58 కోట్లు
⇒ కాంట్రాక్టర్లకు మాత్రం రూ.877.52 కోట్లు విడుదల
⇒ కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
⇒ డబ్బులు రాక, తిండి దొరక్క అవస్థల పాలవుతున్న కూలీలు
⇒ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్న కూలీలు
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. కరువు కోరల్లో చిక్కి వలసబాట పడుతున్న ప్రజలకు సొంత ఊళ్లలోనే పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌కు సాక్షాత్తూ ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తేనే వారి కడుపుల్లోకి నాలుగు మెతుకులు వెళ్లే పరిస్థితి. అలాంటిది నెలన్నర రోజులుగా ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా నిలిపివేసింది. దీంతో నిరుపేద కూలీలు పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకోలేక పనుల కోసం పక్క రాష్ట్రాలకు సైతం వలస వెళ్తున్నారు. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కూలీలకు చెల్లించడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం ఇదే పథకం కింద మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం బకాయిల చెల్లింపునకు రూ.877.55 కోట్లు విడుదల చేయడం గమనార్హం.
నిలిచిపోయిన చెల్లింపులు
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారికి ఫిబ్రవరి రెండో తేదీ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నెలన్నర రోజులకు కూలీలకు రూ.310 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న నిధులను రాష్ట్ర సర్కారు ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఉపాధి హామీ పథకంలోనే మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు చెల్లిస్తూ కూలీలకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వం రూ.877.55 కోట్లు విడుదల చేసింది. అయితే, కూలీలకు పైసా కూడా ఇవ్వకుండా మొత్తం నిధులను ఉపాధి హామీ పథకంలో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్ల బకాయిలకే చెల్లించారు. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత ఆ నెలలో పని చేసిన 13,99,331 కూలీలకు రూ.160.56 కోట్లు, మార్చిలో 17వ తేదీ నాటికి 14,96,161 మందికి రూ.150.02 కోట్ల మేర వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కాంట్రాక్టర్ల కోసం ఎనిమిది సార్లు నిధులు
ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే మెటీరియల్ (కాంట్రాక్టు) పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.877.55 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 21 నుంచి మార్చి 17వ తేదీ మధ్య ఆర్థిక శాఖ ఎనిమిది విడతల్లో నిధులిచ్చింది. ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది.
తొమ్మిది నెలలైనా కూలి డబ్బులు రాలేదు
‘‘మా ఇంట్లో నలుగురం ఫారంపాండ్ గుంతలు తవ్వే పని చేశాం. పనులు పూర్తయి తొమ్మిది నెలలైనా ఇంకా డబ్బులు రాలేదు. నెలల తరబడి కూలి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?’’
– సుంకమ్మ, ఉపాధి కూలీ,ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా
డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం
‘‘ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన మాకు కూలీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిన్నమొన్నటి వరకూ పనులు ప్రారంభించలేదు. నెల రోజులుగా అడపాదడపా మాత్రమే పనులు దొరుకుతున్నాయి. వీటికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఒక్కోసారి కనీస వేతనం రోజుకు రూ.60 కూడా రావట్లేదు’’
– బి.వెంకటమ్మ, ఉపాధి హామీ పథకం కూలీ, అమరాం గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా
ఎప్పటికైనా డబ్బులు ఇస్తారని వెళ్తున్నాం
‘‘నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వేరే పనులకు వెళ్లిపోవాలని అనుకున్నాం. స్థానికంగా వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో ఎప్పటికైనా డబ్బులు ఇస్తారు కదా అనే ఆశతో భారంగానే రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నాం. పనులకు వెళ్లకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని అంటున్నారు. అందుకే తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది’’
– కలికోట పార్వతి, ఉపాధి కూలీ, మామిడిపల్లి గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా
డబ్బులు ఇవ్వకపోతే వలస వెళ్లాల్సిందే..
‘‘ఉపాధి హామీ పథకం కింద పది వారాలుగా పనులు చేసినా వేతనాలు అందలేదు. వారానికొకసారైనా డబ్బులు అందకపోతే బతుకు వెళ్లదీయడం కష్టంగా మారుతోంది. కూలీ సొమ్ము ఎప్పటికప్పుడు చెల్లించకపోతే మూటాముల్లె సర్దుకొని వలసవెళ్లక తప్పదు. బ్యాంకు ఖాతాలతో అంతా గందరగోళంగా ఉంది. పోస్టాఫీస్‌కు వెళితే బ్యాంక్‌లో పడతాయని, మా వద్దకు రావొద్దని చెబుతున్నారు. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు. తిరగలేక చస్తున్నాం’’
– మల్లపురెడ్డి వెంకట్లు, ఉపాధి కూలీ, వల్లూరు గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా
కూలీ డబ్బులు రాకపోతే ఎట్లా బతకాలి?
‘‘డిసెంబర్ నుంచి తొమ్మిది వారాలు ఫారంపాండ్ గుంతలు తవ్వే పనికిపోయాం. ఇంతవరకు ఒక్క రూపాయి కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదు. తొమ్మిది వారాలుగా కూలీ డబ్బులు రాకపోతే మేము ఎట్లా బతకాలి? ప్రభుత్వం వెంటనే మాకు కూలీ డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’’
– పెద్ద రంగన్న, ఉపాధి కూలీ, ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా