కూలీల ఖాతాల్లోకి నేరుగా రూ.200 కోట్లకు పైగా నిధులు జమ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఇచ్చే ఉపాధిహామీ పథకం నిధులను తాత్కాలికంగా ఇతరత్రా పథకాలు, కార్యక్రమాల కోసం మళ్లించేందుకు అలవాటుపడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఎన్‌ఈఎఫ్‌ఎంసీ)ను అమలు చేస్తూ కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధుల్లో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేరకు నిధులు నేరుగా కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితులున్నప్పటికీ ఇతరత్రా పథకాలు, కార్యక్రమాలకు మళ్లించే పరిస్థితి లేకుండా పోయిందని ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. రాష్ట్రంలో దాదాపు 40లక్షల మందికిపైగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు ఏటా రూ.1,300 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేరకు కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు ఇవి నేరుగా ప్రభుత్వ కన్సాలిడేట్ ఫండ్‌లో జమయ్యేవి.
అయితే ఈ ఏడాది ప్రారంభంలో రైతుల రుణమాఫీ, ఆసరా ఫించన్లు, ఇతర ప్రాజెక్టులకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను దారి మళ్లించింది. దీంతో దాదాపు 9లక్షల మంది కూలీలకు నెలపాటు చెల్లింపులు ఆగిపోయాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్రం ఎన్‌ఈఎఫ్‌ఎంసీను అమల్లోకి తెచ్చింది. నేరుగా కూలీల ఖాతాల్లోకి మస్టర్ రోల్ ప్రకారం నిధులను 48గంటల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఎన్‌ఈఎఫ్‌ఎంసీ వివరాల నమోదు బాధ్యతను గ్రామీణాభి వృద్ధి శాఖకు అప్పగించింది.
ఈ పరిస్థితి గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఎంసీ నమోదు చేసే సమయంలో రాష్ట్ర సంచితనిధి ఖాతా నంబర్‌ను ఎంట్రీ చేయాలని అధికారుల ను ఆదేశించింది. వీటిని కొన్ని జిల్లాల అధికారులు అనుసరించగా కొందరు కేంద్రం నిర్దేశించినట్లుగా కూలీల ఖాతా నంబర్లు ఇచ్చారు. దీంతో ఈ నెలారంభం నుంచే కూలీల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మరికొన్ని నిధులు రాష్ట్ర సంచిత నిధిలో జమయ్యాయి. ఈ ఏడాది దాదాపు రూ.200కోట్లకుపైగా కూలీల ఖాతాలకు, మిగతాది రాష్ట్ర ఖజానాలో జమవుతుందని అంచనా వేస్తున్నారు.
‘ఉపాధి’ నిధుల్లో సర్కారుకు చుక్కెదురు
Published Tue, Jan 17 2017 2:25 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM
Advertisement