సవతి తల్లి ప్రేమ చూపుతున్న కేంద్రం
బెంగళూరు: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధుల విడుదల్లో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ శాసనసభలో ఆరోపించారు. బెళగావిలోని సువర్ణ విధానసౌధలో జరుగుతున్న వర్షాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా తన మంత్రిత్వశాఖకు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సోమవారం సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ, ‘ అంతకు ముందు ఏడాది తమిళనాడుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసిన నిధుల్లో తమిళనాడు ప్రభుత్వం 73 శాతమే ఖర్చుచేసినా ఈ ఏడాది రూ.30,943 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
అదే కర్ణాటక ప్రభుత్వం కేం ద్రం విడుదల చేసిన మొత్తం నిధులను వినియోగించుకోవడమే కాకుండా అదనంగా మరో 20 శాతం నిధులను ఈ పథకం కిం ద ఖర్చు చేసింది. అయినా కర్ణాటకకు విడుదల చేసే నిధుల్లో రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కోత వేసి రూ.18,200 కోట్లను మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఎక్కువ నిధులు విడుదల చేస్తోంది.’ అని గణాంకాలతో సహా మం త్రి శాసనసభకు వివరించారు. ఈ సమయంలో బీజేపీ శాసనసభ్యుడు జీవరాజ్ కలుగజేసుకుని, ‘‘మీరు ప్రతిపక్ష పార్టీకు చెందిన శాసనసభ్యుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఈ వాఖ్యలతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి స్పీకర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చి కర్యాకలాపాలు ముందుకు సాగాయి.