
ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల వెల్లువ
ఏప్రిల్–జూన్ మధ్య మూడు రెట్ల వృద్ధితో రూ.28,000 కోట్లకు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిధులతో కళకళలాడుతున్నాయి. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు మూడు రెట్లు అధికమై (గతేడాది ఇదే కాలంలో పోల్చుకుంటే) రూ.28,332 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో వచ్చిన నిధులు రూ.9,479 కోట్లు మాత్రమే. ‘‘ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి నిధుల రాక బలంగా ఉంది. రియల్టీ రంగం పనితీరు పేలవంగా ఉండడం, ఫిక్స్‌డ్ ఇనకమ్ సాధనాల్లో రాబడులు మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఆశ్రయిస్తున్నారు’’ అంటూ బజాజ్ క్యాపిటల్ సీఈవో రాహుల్ పారిక్ పేర్కొన్నారు.
వీటికితోడు ఇన్‌కమ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్‌లో రాబడులు తక్కువగా ఉండడంతో వీటిలోని పెట్టుబడులు ఈక్విటీ, ఈఎల్‌ఎస్‌ఎస్, ఈక్విటీ బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లోకి మళ్లడం కూడా అధికంగా ఉందన్నారు. దీంతో గతేడాది ఇదే కాలంతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి సరికొత్త పథకాల విడుదల కూడా పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో కొత్త పథకాల ద్వారా మ్యూచుల్ ఫండ్స్ సేకరించిన నిధులు రూ.4,908 కోట్లుగా ఉండగా, గతేడాది ఇదే కాలంలో కొత్త పథకాల ద్వారా సమీకరించిన నిధులు 173 కోట్లుగానే ఉండడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లోని మొత్తం పెట్టుబడుల విలువ జూన్ చివరి నాటికి రూ.5.91 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్నాయి.