వర్సిటీలకు అధిక నిధులివ్వాలి
వైస్ చాన్స్‌లర్ల సదస్సులో ఓయూ వీసీ రామచంద్రం
సాక్షి, హైదరాబాద్: ‘‘యూనివర్సి టీలకు అత్యంత కీలకమైన అంశం ఆర్థిక వనరులు. నిధులు సమృద్ధిగా లేకుంటే వర్సిటీ ప్రతిష్టతోపాటు విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుం ది. నిధుల లోటు ఏర్పడితే ముందుగా ప్రభావం చూపేది ఉద్యోగుల వేతనాలపైనే. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలి’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఎస్.రామచంద్రం శుక్రవారం సూచించారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న రెండ్రోజుల వీసీల జాతీయ సదస్సు ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శతాబ్ది ఉత్సవాల అంశంపై వీసీల సమావేశం నిర్వహించాలనుకున్న ప్పటికీ వర్సిటీల పరిస్థితుల దృష్ట్యా 3ఎఫ్ (ఫండింగ్, ఫ్యాకల్టీ, ఫ్రీడం) అంశాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. సదస్సుకు రెండ్రోజులపాటు హాజరైనందుకు వీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేష్ మాట్లాడుతూ వర్సిటీల్లో సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలితోపాటు భారత విశ్వవిద్యాలయాల సమాఖ్య సమన్వయంతో జాతీయ వైస్ చాన్స్‌లర్స్ సదస్సును ఓయూ నిర్వహించింది. దేశంలో ఉన్నత విద్య పరిస్థితి, బోధకులు, నిధుల కేటాయింపు, అధికారాలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు దేశంలోని 177 మంది వీసీలు, వర్సిటీల రిజిస్ట్రార్లు, మాజీ వీసీలు పాల్గొన్నారు.
సెంట్రల్ వర్సిటీలకే ఎక్కువ నిధులా?
పూర్తిస్థాయి బోధకులు, బలమైన పోటీ లేనందున వర్సిటీల పరపతి పడిపోతోందని ఆచార్య వినోబాభావే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీల్లోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అనుబంధ కాలేజీలు సైతం ఉండటంతో వీటికి నిధుల ఆవశ్యకత ఎక్కువ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ యూనివర్సిటీలకే ఎక్కువగా నిధులిస్తూ రాష్ట్ర వర్సిటీలను పెద్దగా పట్టించుకోవట్లేదని పలువురు అభిప్రాయ పడ్డారు. విద్యార్థి సంఘాల సంఖ్య లెక్కకు మించి ఉండటం వల్ల కూడా వర్సిటీల్లో వాతావరణం ఇబ్బందికరంగా మారుతోందని, తరుచూ గొడవలు జరుగుతున్నాయని డిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్లు ప్రస్తావించిన అంశాలను సదస్సు నిర్వాహకులు నమోదు చేసుకున్నారు. వాటిని త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు.