బిడ్డల నోటి‘ముద్ద’ సర్కార్‌ హైజాక్‌ | Redirection of funds | Sakshi
Sakshi News home page

బిడ్డల నోటి‘ముద్ద’ సర్కార్‌ హైజాక్‌

Published Sun, Feb 5 2017 1:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

బిడ్డల నోటి‘ముద్ద’ సర్కార్‌ హైజాక్‌ - Sakshi

బిడ్డల నోటి‘ముద్ద’ సర్కార్‌ హైజాక్‌

మధ్యాహ్న భోజనం నిధులు దారి మళ్లింపు
నిధులు విడుదల చేసినట్లు రికార్డుల్లో చూపుతున్న ప్రభుత్వం

ట్రెజరీల ద్వారా కొర్రీ వేయిస్తూ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన వైనం
బిల్లులందక ఏజెన్సీలు అప్పుల పాలు.. బకాయిలు రూ.150 కోట్లు
డబ్బుల్లేక విద్యార్థులకు అత్యంత నాసిరకమైన భోజనం
వంట పని వారికి ఐదారు నెలలుగా గౌరవ భృతి కరువు

అసలే అరకొర నిధులు.. ఆపై వాటిని విడుదల చేయడంలో సర్కారు అలసత్వం.. అంతులేని నిర్లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కిరాణా కొట్టు వారిని అయ్యా.. బాబూ.. అంటూ బతిమిలాడి ఇన్నాళ్లూ సరుకులు అప్పపై తెచ్చుకున్నాయి. ఇక అప్పుపై ఇవ్వలేమంటూ వారూ చేతులెత్తేయడంతో ఏం వండాలో.. పిల్లలకు ఏం పెట్టాలో తెలీక తలపట్టుకున్నారు. నీళ్ల పప్ప, మగ్గిపోయిన బియ్యంతో వండిన అన్నాన్ని ‘మింగలేక.. కక్కలేక’ విద్యార్థులకు మింగుడు పడటం లేదు. తమ పిల్లలకు ఒక్క పూటైనా భోజనం దొరుకుతుందన్న పేద తల్లిదండ్రుల ఆశ సర్కారు నిర్వాకంతో సన్నగిల్లుతోంది.

సాక్షి, అమరావతి :  రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం పేద పిల్లల కడుపు మాడ్చడానికే మొగ్గు చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 47,635 ప్రభుత్వ స్కూళ్లలోని 43,91,645 మంది పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోంది. ప్రభుత్వం తన రికార్డుల్లో మాత్రం నిధులు విడుదల చేస్తున్నట్లు చూపుతూ ట్రెజరీల్లో చెల్లింపులు చేయకుండా నిషేధం విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నెలకు రూ.30 కోట్లకు పైగా ఈ పథకం కింద నిధులు రావాలి. ఈ లెక్కన ఐదు నెలలుగా దాదాపు రూ.150 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. దీంతో క్షేత్ర స్థాయిలో పథకం అమలులో వేలాది ఏజెన్సీలు నానా అవస్థలు పడుతున్నాయి.

ఆయా గ్రామాల్లోని దుకాణ వ్యాపారులు దయతలచి అప్పుపై సరుకులు అందిస్తే విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. వ్యాపారులు అప్పులివ్వని చోట ఈ పథకం పడకేసింది. రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇదే పరిస్థితి. బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తుండగా ఇతర సరుకులకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా నిధులను ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడం మాట అటుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సైతం విడుదల చేయకుండా దారి మళ్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ప్రతి రోజూ అన్నంతో పాటు కూర, వారానికి మూడు కోడి గుడ్లు, పప్పు, చారుతో మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో డ్వాక్రా గ్రూపు మహిళలు, మరి కొన్ని చోట్ల నాంది ఫౌండేషన్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి ప్రభుత్వం నాణ్యమైన బియ్యం కూడా సరఫరా చేయడం లేదు. పలుచోట్ల అత్యంత నాసిరకమైన మగ్గిన బియ్యాన్ని సరఫరా చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి డిమాండ్‌ చేశారు.

► బియ్యం మినహా ఇతర సరుకుల కోసం ఒక్కో జిల్లాకు నెలకు సగటున రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు అవసరం. విద్యార్థుల సంఖ్యను అనుసరించి కృష్ణా జిల్లాలో అత్యధికంగా రూ.4.75 కోట్లు, నెల్లూరులో రూ. 2.25 కోట్లు, తూర్పుగోదా వరిలో రూ.3.10 కోట్లు.. ఇలా ప్రతి జిల్లా లో నెలనెలా నిధులు విడుదల చేయాలి.   
► ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఒక రోజుకు రూ.4.86, హైస్కూలు విద్యార్థికైతే రూ.6.78 చొప్పున సరుకుల కోసం ప్రభుత్వం విడుదల చేసేది. దీనిని గత ఏడాదిలో రూ.5.13,  రూ.7.18కి పెంచినా నిధులు విడుదల చేయడం లేదు. వంటచేసే వారికి నెలకు ఇవ్వాల్సిన రూ.1000 గౌరవ భృతి కూడా ఐదారు నెలలుగా ఇవ్వలేదు.
► ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు నీళ్ల చారు, ఉడికీ ఉడకని అన్నం దిక్కవుతోంది. గత ఏడాది జూలైలో ప్రభుత్వం 1–8 తరగతి వరకు పిల్లలకు రూ.132.25 కోట్లు, 9, 10 తరగతుల పిల్లలకు రూ.16.49 కోట్లు విడుదల చేసింది. నవంబర్‌లో 1–8 తరగతుల వారి కోసం రూ.239.98 కోట్లు, హైస్కూల్‌ పిల్లలకు రూ.70.55 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఆయా ట్రెజరీల ద్వారా నిధులు అందలేదు. కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్‌ నుంచి, కొన్ని జిల్లాల్లో అక్టోబర్‌ నుంచి నిధులు అందడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
►  సిలిండర్, స్టవ్‌ ఉన్నప్పటికీ డబ్బులు లేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. పొగ వల్ల ఇలు వంట పని వారు, అటు విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
► కర్నూలు జిల్లాలో వంట పని వారికి గత ఏడాది ఆగస్టు నుంచి గౌరవ భృతి ఇవ్వలేదు. బిల్లులు సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు నిలిపివేశారు.  

ఈ సర్కారుకు కనికరం లేదు
గతేడాది అక్టోబర్‌ నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇన్నాళ్లు అప్పులిచ్చిన వారు ఇక ఇవ్వమని చెబుతున్నారు. నిత్యావసర సరుకులు, గ్యాస్, కోడిగుడ్ల ధరలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో నెలల తరబడి బిల్లులు చెల్లించకపోతే ఏ విధంగా బతకాలి? ప్రభుత్వం సరుకులకు ఇస్తున్న మొత్తం గిట్టుబాటు కావడం లేదు.   ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 ఇవ్వాలి. స్వల్ప మొత్తానికి వెట్టి చాకిరీ చేస్తున్నా ఈ సర్కారుకు మాపై కనికరం లేదు.     
–షేక్‌ జాస్మిన్, ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, గుంటూరు  

శ్రమ దోపిడీ
మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వారి శ్రమ దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వం నిరంకుశ నిర్ణయాలతో వంట నిర్వాహకులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించడం లేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాము. బకాయిలు చెల్లిస్తే ఏజెన్సీల భారం వదులుకుని ఏదో ఒక పని చేసుకుని బతకడానికి కొందరు సిద్ధమయ్యారు.
–పంచాది లతాదేవి, మధ్యాహ్న బోజన పధకం వర్కర్స్‌అండ్‌ హెల్పర్స్‌   యూనియన్, సీఐటీయు నాయకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement